Sitaram Yechury | వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దివారాలుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం పరిస్థితి విషమించడంతో ఊపిరివదిలారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఆయన గుర్తింపు పొందారు. 1992 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు.
సీతారాం ఏచూరి మద్రాస్‌లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారి. ఆయన బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆల్ సెయింట్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లారు. ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరిన ఆయన.. 1970లో సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా తీసుకున్నారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా.. డాక్టరేట్‌ని పూర్తి చేయలేకపోయారు.
సీతారాం ఏచూరి 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఏడాది ఆయన సీపీఎంలో సభ్యుడిగా చేరారు. అత్యవసర పరిస్థితికి ముందు కొంతకాలం ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన సమయంలో ఎన్నో అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలను ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.
అమెరికా విదేశాంగ విధానాన్ని సీతారాం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు. ఇస్లాం ఛాందసవాదం పెరిగేందుకు అమెరికానే కారణమని ఏచూరి విమర్శిస్తుంటారు. పశ్చిమ ఆసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపించారు. అమెరికా సైనిక జోక్యంతో ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే దీనికి నిదర్శనమని ఈయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనం చేస్తోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకునేందుకు పెత్తనం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమని.. ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కుకుండా సైన్యం జోక్యం చేసుకుందని సైతం విమర్శించారు.