న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే తొలి దశ మ్యాచ్‌ల వివరాలు వెల్లడి కాగా, కొన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిగతా మ్యాచ్‌ల వేదికలు, తేదీలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 13 నుంచి మొదలై మే 24వ తేదీ వరకు మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి దశ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 19వ సీజన్‌కు తెరలేవనుంది. ‘లీగ్ రెండో దశలో మొత్తం 50 మ్యాచ్‌లు 12 వేదికల్లో జరుగుతాయి. ఇందులో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరువయ్యే నాటికి జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు ఆస్కారం ఉంటుంది. సెకండ్ షెడ్యూల్లో ఎనిమిది డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతాయి. పంజాబ్ కింగ్స్ తమ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌తో పాటు ధర్మశాలలో, రాజస్థాన్ రాయల్స్..జైపూర్‌లో, ఆర్సీబీ..బెంగళూరుతో పాటు రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లు ఆడుతుంది’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ పేర్కొన్నారు.