IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆరంభ శూరత్వానికే పరిమితమైంది. తొలి పోరులో 286 పరుగులతో రికార్డు సృష్టించిన కమిన్స్ సేన వరుసగా మూడు మ్యాచుల్లో చతికిలపడింది. టాపార్డర్ వైఫల్యం.. బౌలింగ్‌లో పస లేకపోవడం కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు భారీ లక్ష్యాల్ని ఊది పడేస్తుంటే.. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ మాత్రం కనీస పోరాటం చేయకపోవడం అభిమానులను కలవరపరుస్తోంది.
గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచికొడుతారని ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ, జరిగింది వేరు. 9 రన్స్‌కే 3 వికెట్లు పడ్డాయి. చివరకు.. 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. టాప్ గన్స్ నిలకడ లేమి, బాధ్యతా రాహిత్యమే 18వ సీజన్లో హ్యాట్రిక్ ఓటములకు కారణం అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పరిస్థితి.. రికార్డులు ఘనం.. ఆట అధ్వానం అన్నట్టుగా ఉంది.
Ishan Kishan 🤝 SRH – A dream debut 🤩
Kishan (106* off 47) becomes the first Indian to hit a ton for SRH as they finish with a massive 286/6.#IPL2025 #SRHvRR pic.twitter.com/lbaewnUCIe
— Cricbuzz (@cricbuzz) March 23, 2025
బ్యాటుతో బెంబేలిత్తించి.. బంతితో పడగొడుతూ ప్రత్యర్థులను ఇరుకుపెట్టే సన్‌రైజర్స్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవాలంటే ఓపెనర్లను త్వరగా ఔట్ చేస్తే చాలనే విషయాన్ని గ్రహించిన ప్రత్యర్థి జట్లు.. అందుకు తగ్గట్టు వ్యూహాలు పన్నుతూ సఫలం అవుతున్నాయి. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమితో మొదలు.. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా జట్లపై కమిన్స్ సేన కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. కోల్‌కతాపై మనోళ్ల ఆట చూసిన అభిమానులు ‘ఆడుతున్నది ఐపీఎల్లో అత్యధిక స్కోర్ కొట్టిన జట్టేనా’ అని అశ్చర్యపోయారు. కోల్‌కతా కంచుకోటలో 9 పరుగులకే 3 వికెట్లు పడడంతో పవర్ ప్లేలోనే ఓటమి ఖారారైంది. గత మూడు మ్యాచుల్లోనూ ఓపెనర్లు హిట్ అయితేనే మిడిలార్డర్ రాణిస్తున్నారు. లేదంటే.. అందరూ కట్టగట్టుకొని పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు.
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025
బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లనే అతిగా నమ్ముకోవడమే సన్‌రైజర్స్ కొంపముంచుతోంది. దీనికి ఆటగాళ్లు బాధ్యతారాహిత్యం కూడా కొంతమేర కారణం. పరిస్థితులను అర్థం చేసుకోకుండా దూకుడే మంత్రగా ఆడాలనుకోవడం ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే.. ఇంకా 10 లీగ్ దశ మ్యాచ్‌లున్నాయి. ఆటగాళ్లు తమ ఆటను విశ్లేషించుకుని గాడిలో పడితే నిరుడు రన్నరప్ అయిన కమిన్స్ బృందం మళ్లీ విజయాల బాట పట్టడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుతానికి నాలుగింట ఒకే విజయంతో 10వ స్థానంలో ఉన్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే.
కోల్‌కతా చేతిలో ఊహించని ఓటమిపై స్పందించిన కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయంతో విభేదించాడు. ‘పవర్ ప్లేలో మాకు శుభారంభం లభించింది. ఒకదశలో కోల్‌కతా 85కే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాం. కానీ, కానీ, తర్వాతి10 ఓవర్లలో మా బౌలర్లు విఫలమయ్యారు. దాంతో, ఆతిథ్య జట్టు 20 ఓవర్లకు ఆ జట్టు 200 కొట్టింది. కోల్‌కతాను 170 లేదా 180లోపు కట్టడి చేయాల్సింది. అయితే.. మా వ్యూహాలను సమర్థంగా అమలు చేయలేకపోయాం’ అని ఫ్రాంక్లిన్ వాపోయాడు. అయితే.. కమిన్స్ మాత్రం 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించామని చెప్పాడు. కానీ, మూడు ఓవర్లలోనే 3 వికెట్లు పడడంతో మ్యాచ్ కోల్‌కతా చేతుల్లోకి వెళ్లిందని కమిన్స్ అన్నాడు.