Hyderabad | కాచిగూడ, ఏప్రిల్ 4 : మీకు, మీ ఇంటికి దోషం పట్టింది.. ఇల్లు మీ పేరు మీద ఉండటం మంచిది కాదు.. మీ భర్తలాగే మీ కుటుంబమంతా హఠాత్తుగా చనిపోతుందని ఓ మహిళను బెదిరించాడు ఓ బురిడీ బాబా. దోషం పోగొట్టేందుకు పూజలు చేయాలని ఆమె నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారం తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ పూజలు చేసే ఓ పూజారి చనిపోయాడని, అతనికి నష్టపరిహారం చెల్లించాలని ఆమె ఇంటి పత్రాలను కూడా లాగేసుకున్నాడు. ఇదంతా సదరు మహిళ కూతురికి తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ తిలక్ నగర్లో నివాసం ఉండే గీత వైద్య అనే మహిళ భర్త దిల్‌సుఖ్‌నగర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. ఏడాది క్రితం అతను చనిపోయాడు. దీంతో అతనికి బదులుగా గీత వైద్య అదే కాలేజీలో లెక్చరర్‌గా చేరింది.అదే సమయంలో శివస్వామి అనే బాబాను గీత వైద్యకు కాలేజీ ప్రిన్సిపల్ సౌమ్య పరిచయం చేసింది. ఏవైనా దోషాలు ఉంటే ఆయన పోగొడుతాడని చెప్పింది. ఆమె మాటలు నమ్మి శివస్వామికి గీత వైద్య తన కష్టాలు అన్ని చెప్పుకుంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శివస్వామి మరింత భయపెట్టించాడు. ఇంట్లో చాలా దోషం ఉందని.. పెద్ద పెద్ద పూజలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. గీత నుంచి రూ.1.70 లక్షలు వసూలు చేశాడు. అనంతరం శ్రీకాళహస్తికి తీసుకెళ్లి పూజలు కూడా చేయించాడు. అయినప్పటికీ దోషం పోలేదని దిల్సుఖ్నగర్ కనకదుర్గ ఆలయంలో పూజలు చేయాలని గీత నుంచి 26 తులాల బంగారం తీసుకున్నాడు. ఇలా పూజలు చేసే సమయంలో దోషం తగిలి ఓ పూజారి మరణించాడని.. అతని కుటుంబం డబ్బులు డిమాండ్ చేస్తుందని బెదిరించి గీత ఉంటున్న ఇంటి పత్రాలను తీసుకున్నాడు.
ఈ విషయం తెలిసి గీత కూతురు వెంటనే తల్లిని తీసుకుని ఎల్బీనగర్లోని శివస్వామి ఇంటికి వెళ్లింది. మాకు పూజలు, మంత్రాలు ఏమీ వద్దు.. దోషం పోకున్నా ఫర్వాలేదు అని గొడవ చేసి అతని నుంచి ఇంటి పత్రాలు తీసుకుంది. డబ్బు, బంగారం అడిగితే ఇవ్వలేదు. దీంతో కాచిగూడకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్యలో ఇదంతా జరిగినట్లు పోలీసులు తెలిపారు.