అదిరిపోయే బ్యాటింగ్‌కు క్రమశిక్షణాయుత బౌలింగ్ తోడవడంతో ఐపీఎల్లో రాజస్థాన్ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. జైస్వాల్, బట్లర్ బాదుడే పరమావధిగా చెలరేగగా.. గువాహటి మైదానం బౌండ్రీల
జడివానలో తడిసి ముైద్దంది. ఆఖర్లో హెట్‌మైర్ సిక్సర్లతో చెలరేగడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగా..
ఛేదనలో వార్నర్ తప్ప తక్కినవాళ్లంతా చేతులెత్తేయడంతో ఢిల్లీ వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది.
గువాహటి: ఓపెనర్లు దంచికొట్టడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. పంత్ గైర్హాజరీతో డేవిడ్ వార్నర్ సారథ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీకి ఇది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (51 బంతుల్లో 79; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్నివ్వగా.. హెట్‌మైర్ (21 బంతుల్లో 39 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ (55 బంతుల్లో 65; 7 ఫోర్లు), లలిత్ యాదవ్ (38; 5 ఫోర్లు) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
తొలి ఓవర్లోనే ఐదు ఫోర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐదు ఫోర్లు కొట్టాడు. తానేం తక్కువా అన్నట్లు రెండో ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు దంచాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ వరుస బౌండ్రీలతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అక్షర్ ఓవర్లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు అరుసుకోవడంతో 5 ఓవర్లలో రాజస్థాన్ 63/0తో నిలిచింది. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న జైస్వాల్‌ను ముఖేశ్ ఔట్ చేయగా.. ఆ తర్వాత బాదే బాధ్యత బట్లర్ తీసుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (0), రియాన్ పరాగ్ (7) విఫలమైనా.. ఆఖర్లో హెట్‌మైర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 199/4 (బట్లర్ 79, జైస్వాల్ 60; ముఖేశ్ 2/36), ఢిల్లీ: 142/9 (వార్నర్ 65, లలిత్ 38; బౌల్ట్ 3/29, చాహల్ 3/27).