Mohammed Siraj | దుబాయి వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతున్నది. టీమిండియా స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడి మరి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన స్టార్ బౌలర్ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ సైతం వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వేలంలోకి వచ్చిన సిరాజ్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్ మధ్య పోటీ గట్టిగానే సాగింది. గత కొంతకాలంగా సిరాజ్ టీమిండియా తరఫున అన్ని టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. దాంతో ఈ బౌలర్‌ను కొనుగోలు చేసేందుకు ఆయా జట్లు పోటీపడ్డాయి. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన సిరాజ్ ధర భారీగా పెరిగింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చివరి వరకు పోటీపడ్డాయి. చివరకు రూ.12.25కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు సిరాజ్‌ను కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్స్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీని రూ.10 కోట్లకు తీసుకున్నది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన షమీ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసేందుకు మొదటి ఆసక్తి చూపింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ సైతం రంగంలోకి దిగింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి కనబరిచింది. చివరకు కావ్య మారన్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం సీనియర్ ప్లేయర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. ఏకంగా రూ.10కోట్లకు తీసుకున్నది. మహ్మద్ షమీ 2022, 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు. రాబోయే సీజన్లో హైదరాబాద్ జెర్సీ వేసుకోనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 వికెట్లు, ఐపీఎల్ 2023 సీజన్లో 28 వికెట్లతో సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత చీలమండ గాయంతో 2024 సీజన్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతన్ని గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసింది. రైట్ టూ మ్యాచ్ కార్డ్‌ని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో హైదరాబాద్‌కు కలిసి వచ్చింది. షమీ తొలిసారిగా 2013లో డేర్ డేలివిల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తరఫున ఆడాడు.