IPL Auction | క్రికెట్ మాత్రమే కాదు.. ఏ ఆట ఆడాలన్నా.. ఫిట్నెస్ తప్పనిసరి. ఫిట్నెస్తోపాటు ఆరోగ్యంగా ఉన్న వారు మాత్రమే సరిగ్గా ఆడగలరు. త్వరలో ప్రారంభం కానున్న 20 ఓవర్ల మ్యాచ్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ-2022 కోసం ఫ్రాంచైసీలు తమ ఆటగాళ్లను వేలంలో సొంతం చేసుకోనున్నాయి. శని, ఆదివారాల్లో జరిగే వేలం కోసం బీసీసీఐ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. మంచి ఫామ్‌లో ఉన్న కుర్రాళ్లతోపాటు పోటీ పడాలంటే సీనియర్ ప్లేయర్లు కాస్త చెమటోడ్చాల్సిందే. మంచి ఫామ్‌లో ఉంటే ఐపీఎల్ వేలంలో బెస్ట్ ధర పలుకుతారు. ఒకవేళ సరైన ఆటతీరు ప్రదర్శించలేకపోతే, టోర్నీ నుంచే తప్పుకోవాల్సి ఉంటుంది. గమ్మత్తేమిటంటే ఈ దఫా ఐపీఎల్-2022 వేలానికి బీసీసీఐ ప్రతి క్రికెటర్‌కు బేస్ రేట్ రూ.2 కోట్లు ఖరారు చేసింది. ఈ వేలం కోసం 17 మంది ఇండియన్ ప్లేయర్లతోపాటు మొత్తం 48 మంది ఇంటర్నేషనల్ క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ టోర్నీలోని 10 ఫ్రాంచైసీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్‌ను 2020 టోర్నీలో పంజాబ్ ఎలెవెన్ వదిలేసుకుంది. 2021 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.60 కోట్లకు సొంతం చేసుకుంది. 2020 టోర్నీలో 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టినా. గత సీజన్లో 13 మ్యాచ్‌లకు ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. కేవలం 37 పరుగులతో అందరినీ నిరాశ పరిచాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలకంగా వ్యవహరించిన ప్లేయర్ శిఖార్ థావన్. మూడేండ్లుగా 500కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా శిఖార్ ధావన్‌కు మంచి డిమాండ్ లభించొచ్చని భావిస్తున్నారు.
2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఆ జట్టు సారధి శ్రేయస్ అయ్యర్.. గత సీజన్లో 8 మ్యాచ్‌లకు 175 పరుగులే చేశాడు. కెప్టెన్సీ కోల్పోవడంతోపాటు సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ప్రస్తుత సీజన్లో కొత్త ఫ్రాంచైసీలు తీసుకుంటాయనుకున్నా.. అదేమీ జరుగలేదు. ఇక ఆర్సీబీ ఓపెనర్‌గా 14 మ్యాచ్‌ల్లో 411 పరుగులతో రాణించిన దేవదూత్ పాడిక్కల్కు మంచి డిమాండ్ ఉంది. 2020 సీజన్లోనూ 473 పరుగులతో అదరగొట్టాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా 2020లో పరుగులేమీ చేయలేదు. గతేడాది సీజన్లో 160 పరుగులు మాత్రం చేశాడు. 2021 టోర్నీ ప్రదర్శన ప్రకారం ఏ ఫ్రాంచైసీ ముందుకు రాకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
పాండ్యా బ్రదర్స్‌లో హార్దిక్ పాండ్యాను అహ్మదాబాద్ ఫ్రాంచైసీ తీసేసుకుంది. ఇక కృనాల్ పాండ్యా గత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 143 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి, ఘోరంగా విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్సీబీకి చేరిన హర్షిల్ పటేల్.. గత సీజన్లో 32 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. ఈసారి ఫ్రాంచైసీలు భారీమొత్తంలో వెచ్చించి హర్షిల్ పటేల్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడొచ్చు.
ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు ఇషాన్ కిషన్. రోహిత్, డికాక్ వంటి హేమాహేమీలు ఉన్నా.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాట్స్మన్ల కోసం ముంబై ఇండియన్స్‌లో పోటీ ఎక్కువ. ఇషాన్ కిషన్ గత సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 241 పరుగులు చేశాడు. కనుక ఫ్రాంచైసీలు ఇషాన్‌ను గెలుచుకునేందుకు పోటీ పడవచ్చు.
టీం ఇండియా ఆల్రౌండర్లుగా ఎదుగుతున్న శార్దూల్, దీపక్ చహర్‌లలో చహార్‌ను గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.80 లక్షలకు సొంతం చేసుకుంది. పవర్ ప్లేలో ఓపెనింగ్ బౌలర్‌గా వికెట్లుతీయడం చహర్ స్పెషాలిటీ. శార్దూల్ మిడిల్ బౌలర్లలో కీలకం. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న శార్దూల్‌ను కూడా గత సీజన్లో చెన్నై గెలుచుకుంది.
గతంలో హైదరాబాద్ సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోర్లకు కాచుకుని గెలిపించిన భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు ఫామ్‌లో తేలిపోతున్నాడు. గత సీజన్లో 11 మ్యాచ్‌లకు ఆరు వికెట్లే తీశాడు. ఈ దఫా పెద్దగా ధర పలుకకపోవచ్చునని అంటున్నారు. ఇక చాహల్ ఆర్సీబీకి వెన్నముక వంటి బౌలర్. క్లిష్ట సమయంలో వికెట్ తీసి ప్రత్యర్థిలో టెన్షన్ తేగల సమర్థుడు. ఇంకా అంబటి రాయుడు రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తిక్, ఉమేశ్ యాదవ్, షమీ కూడా తమ బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా పెట్టుకున్నారు. మెగా వేలంలో వీరికి భారీ ధర లభించకపోయినా.. బేస్ ధరకు ఏదో ఒక ఫ్రాంచైసీ వీరిని దక్కించుకోవచ్చు.