IPL Playoffs | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొనసాగుతున్నది. ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 56 మ్యాచులు జరిగాయి. ప్రస్తుతం మూడు జట్లు ప్లేఆఫ్ (IPL Playoffs) రేసు నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్ నుంచి తప్పుకోగా.. ఏడు జట్లు రేసులో ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ప్లేఆఫ్‌కు చేరుకున్న జట్టుగా చెన్నై పేరిట రికార్డు ఉన్నది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ రెండోస్థానం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదోస్థానాల్లో ఉన్నాయి. టాప్-5లో ఉన్న ఆర్సీబీ పేరిట చెత్త రికార్డు ఉన్నది. ఇప్పటి వరకు ఒక్కసారి టైటిల్‌ను నెగ్గలేకపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 12 సార్లు ఐపీఎల్లో ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందులో ఆ జట్టు ఐదుసార్లు టైటిల్‌ని నెగ్గింది. 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది. ఈ టైటిల్స్ అన్నీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే సాధించింది. ప్లేఆఫ్‌లో అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు సైతం సీఎస్కే పేరిట ఉన్నది. ప్లేఆఫ్‌లో 26 మ్యాచులు ఆడి.. ఇందులో 17 గెలిచింది. మరో తొమ్మిది మ్యాచుల్లో పరాజయం పాలైంది.
ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ రెండోస్థానంలో ఉంది. ఎంఐ ఇప్పటి వరకు పదిసార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ని సాధించింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టైటిల్‌ను సాధించింది. ఈసారి కూడా జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. చెన్నై తర్వాత ముంబయి ప్లేఆఫ్‌లో అత్యధిక మ్యాచులు ఆడింది. ప్లేఆఫ్‌లో 20 మ్యాచులు ఆడి 13 మ్యాచుల్లో గెలిచింది. ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది.
ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లేఆఫ్‌కు చేరిన జట్ల జాబితాలో మూడోస్థాంలో ఉంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ప్లేఆఫ్‌కు చేరింది. అయితే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ని సాధించలేకపోయింది. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్నది. ప్రస్తుతం అన్నిరంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ముందంజలో ఉన్నది. ఈ సారి కూడా ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సారైనా కప్పు సాధిస్తుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది. గత సీజన్లో ఆర్సీబీ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ప్లేఆఫ్‌లలో ఆర్సీబీ రికార్డు అంత బాగాలేదు. ఆ జట్టు 15 మ్యాచులు ఆడి అందులో ఐదు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఆర్సీబీకి పది మ్యాచుల్లో ఓటమి ఎదురైంది.
సన్‌రైజర్స్ జట్టు ఇప్పటివరకు తొమ్మిది సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. రెండుసార్లు టైటిల్‌ని సాధించింది. సన్‌రైజర్స్ కంటే ముందు.. డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో టైటిల్‌ను గెలుచుకుంది. 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. చివరిసారిగా పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈసారి సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. ప్రారంభ మ్యాచుల్లో అద్భుతంగా రాణించినా.. ఆ తర్వాత మ్యాచుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది.
కేకేఆర్ జట్టు ఎనిమిదిసార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందులో 2012, 2014, 2024లో మూడుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ రెండు సార్లు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఒకసారి టైటిల్‌ని సాధించింది. అయితే, ప్లేఆఫ్‌లో కేకేఆర్ రికార్డు బాగుంది. ఆ జట్టు 15 మ్యాచుల్లో పదింట్లో గెలిచింది. కేకేఆర్ ఐదుసార్లు ఓడిపోయింది. అయితే, ఈసారి ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునేందుకు భారీగానే శ్రమిస్తున్నది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడోస్థానంలో ఉంది. ఆ జట్టుకు ఇంకా మూడు మ్యాచులు ఉన్నాయి. ఈ మ్యాచుల్లో గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశాలుంటాయి. అదే సమయంలో ఇతర జట్ల గెలుపోటములు సైతం కేకేఆర్ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.