IPL 2025 | గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లాయి. అయితే, హైదరాబాద్ జట్టుకు పూర్తిగా ప్లేఆఫ్ వెళ్లేందుకు మార్గం ఇంకా ఉన్నది. హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచుల్లో మూడు విజయాలు, ఏడు ఓటములతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నది. మరో వైపు గుజరాత్ జట్టు ప్లేఆఫ్‌కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్నది. ఏడు విజయాలు, మూడు ఓటములతో 14 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సన్‌రైజర్స్ ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే తప్పనిసరిగా మిగతా నాలుగు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ సైతం మెరుగుపరుచుకోవాల్సిందే. ఇందు కోసం ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. మిగతా నాలుగు మ్యాచుల్లో అలా చేయగలిగితే 14 పాయింట్లు ఉంటాయి. గత సీజన్లో ఆర్సీబీ సైతం ఇదే 14 పాయింట్లతో ప్లేఆఫ్ చేరుకోగలిగింది. ప్రస్తుతం ముంబయి, గుజరాత్, ఆర్సీబీ 14 పాయింట్లతో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నది. ఇక సన్‌రైజర్స్ ప్లేఆఫ్ చేరుకోవాలంటే.. పంజాబ్ మిగతా అన్ని మ్యాచుల్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది.
రెండోస్థానంలో ఉన్న గుజరాత్ సైతం ప్రత్యర్థి జట్టు చేతిలో భారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. ఢిల్లీ జట్టు పంజాబ్, గుజరాత్ జట్లను ఓడించాలి. లక్నో జట్టు పంజాబ్, గుజరాత్ జట్లను ఓడించాలి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్‌రైజర్స్‌పై ఓడిపోవాలి. కేకేఆర్ జట్టు సైతం నాలుగు మ్యాచుల్లో రెండింట్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధ్యమైతేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే సన్‌రైజర్స్, లక్నో, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. సన్‌రైజర్స్ జట్టు మెరుగైన రన్‌రేట్ ఉంటే.. చివరి నాలుగు స్థానాల్లోనే నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఇది అంత సులభం కాదు. సన్‌రైజర్స్ ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.. అద్భుతం జరిగితే మాత్రమే ప్లేఆఫ్ చేరుతుంది.