Shardul Thakur | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడనున్నాడు. మెగా వేలంలో ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. లక్నో సూపర్ జెయింట్ జట్టు ఆటగాడు మొహ్సిన్ ఖాన్ గాయపడ్డాడు. దాంతో అతని ప్లేస్‌లో ఈ ఆల్‌రౌండర్‌ను ఎల్ఎస్జీ జట్టులోకి తీసుకున్నది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నది. ఐపీఎల్ ఒక ప్రకటనలో లక్నో సూపర్ జెయింట్స్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుందని పేర్కొంది. గాయం కారణంగా ఖాన్ ఐపీఎల్ 18వ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నట్లు పేర్కొంది.
ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ శార్దూల్ ఠాకూర్‌ను బేస్ ప్రైజ్ రూ.2కోట్లకు జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ పరిపాలన ధ్రువీకరించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో లక్నో జట్టుతో శార్దూల్ చేశాడు. పాదాల శస్త్ర చికిత్స తర్వాత కోలుకున్న శార్దూల్.. రంజీల్లో ముంబయి తరఫున అద్భుతంగా రాణించాడు. తొమ్మిది మ్యాచుల్లో 505 పరుగులు చేసి 35 వికెట్లు తీశాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో.. కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఎసెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఎవరైనా ప్లేయర్ స్థానంలో రీప్లేస్ కోసం ఆఫర్ వస్తే అంగీకరిస్తానని ఎసెక్స్‌తో ఒప్పంద సమయంలో తెలిపాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సమయంలో మొహ్సిన్ కుడి మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత కోలుకొని లక్నో జట్టుతో చేరాడు. ప్రస్తుతం ఇంకా గాయం తగ్గలేదని.. కోలుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్లో శార్దూల్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు 95 మ్యాచుల్లో 94 వికెట్లు తీశాడు. 36 పరుగులు ఇచ్చిన నాలుగు వికెట్లు తీశాడు. ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. అలాగే, 138.92 స్ట్రయిక్ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఇదిలా ఉండగా.. మయాంకర్ ఫిట్నెస్ లక్నో జట్టును ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం అతను సైతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. మ్యాచ్ ఆడేందుకు ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. ఐపీఎల్ 2025 సీజన్ తొలి దశలో ఆడేందుకు అవకాశం లేదని పలు నివేదికలు తెలిపాయి. ఏప్రిల్ రెండోవారంలో మాత్రమే జట్టుతో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు కీలక ప్లేయర్ లేకపోవడంతో ఎల్ఎస్జీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.