IPL | బెంగళూరు: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్.. శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. పునరుద్ధరించిన షెడ్యూల్ ప్రకారం ఆరు వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. యాధృశ్చికమో ఏమో గానీ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ మాదిరిగానే రీస్టార్ట్ మ్యాచ్ సైతం డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్యే జరుగనుండటం విశేషం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటం గమనార్హం. ఇక ఈనెల 27న లక్నో, బెంగళూరు మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనున్న ఈ టోర్నీలో ప్లేఆఫ్స్‌నకు సంబంధించిన వేదికలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. మే 29న క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2 జరుగనుండగా జూన్ 3న ఫైనల్‌ను నిర్వహించనున్నారు. పునరుద్ధరణ తర్వాత జరుగబోయే మ్యాచ్‌లలో చీర్ లీడర్స్, డీజేలు లేకుండా టోర్నీని జరిపించనున్నట్టు వార్తలు వచ్చినా దానిపై బీసీసీఐ మాత్రం అధికారికంగా స్పందిచలేదు. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ కొత్త షెడ్యూల్లో ఆ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆడించనుండటం సన్‌రైజర్స్ అభిమానులకు నిరాశను కలిగించేదే!
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా మే 8న జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా (ఒక ఇన్నింగ్స్‌లో 10.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది) ఆగి.. ఈ సీజన్ వాయిదాపడే సమయానికే మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలా 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ 13 పాయింట్లతో రేసులో నిలిచాయి. అధికారికంగా నిష్క్రమించకపోయినా కోల్‌కతా, లక్నో.. ఎలిమినేషన్‌కు ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాయి. ఇక మరో మ్యాచ్ గెలిస్తే గుజరాత్, బెంగళూరు.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటాయి.శనివారం కేకేఆర్‌తో పోరులో బెంగళూరు గనక విజయం సాధిస్తే 18 పాయింట్లతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలుస్తుంది. పంజాబ్, ఢిల్లీకి తలా మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగా 14 పాయింట్లతో ఉన్న ముంబై రెండు మ్యాచ్‌లే ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కటి ఓడినా హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ధర్మశాలలో ఆగిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను మళ్లీ మొదట్నుంచి ఆడించనున్నారు. ముంబై ఓ మ్యాచ్‌లో ఓడి మిగిలిన మూడు మ్యాచ్‌లలో గనక పంజాబ్, ఢిల్లీ తలా రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరమవనుంది.
ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత జరుగబోయే కేకేఆర్, బెంగళూరు పోరులో అందరి కండ్లూ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఆ ప్రకటన తర్వాత ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అతడితో పాటు బెంగళూరు అభిమానులకు ఈ పోరు ఎంతో ప్రత్యేకం కానుంది. కోహ్లీకి ట్రిబ్యూట్‌గా ఆర్సీబీ అభిమానులంతా వైట్ టీషర్ట్స్‌లో రానున్నారు. చిన్నస్వామి శ్వేత వర్ణం పులుముకోనుంది.
ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీకి కీలక మ్యాచ్‌ల ముందు ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత్‌కు తిరిగిరాలేనంటూ క్యాపిటల్స్ యాజమన్యానికి లేఖ రాసినట్టు తెలుస్తున్నది. స్టార్క్ లేకపోవడం ఢిల్లీ బౌలింగ్ విభాగానికి తీరని లోటు. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ 14 వికెట్లు పడగొట్టాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని క్యాపిటల్స్ ఇంకా భర్తీ చేయలేదు. ఓపెనర్ డుప్లెసిస్ రాకపైనా స్పష్టత లేదు. కాగా జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ స్థానాన్ని భర్తీ చేయనున్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు ఎన్వోసీ అందజేసింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ పేరిట చారిత్రక వాంఖడే స్టేడియంలో కొత్త స్టాండ్ కొలువు దీరింది. దేశ క్రికెట్‌కు రోహిత్ చేసిన సేవలకు గుర్తింపుగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) శుక్రవారం రోహిత్ స్టాండ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రోహిత్ కుటుంబ సభ్యులకు తోడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ల సమక్షంలో స్టాండ్‌ను సీఎం ఫడ్నవీస్ ఆవిష్కరించారు.
ఆరెంజ్ క్యాప్: సూర్యకుమార్ యాదవ్ (12 ఇన్నింగ్స్‌లలో 510 పరుగులు)
పర్పుల్ క్యాప్ : ప్రసిద్ధ్ కృష్ణ (11 మ్యాచ్‌లలో 20 వికెట్లు)