Lucknow Super Giants | ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ టోర్నీలో పలు మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉన్నది. మయాంక్ ఇంకా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గత సంవత్సరం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత వెన్నునొప్పి బారినపడ్డాడు. బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే బౌలింగ్ సాధన ప్రారంభించాడు. మయాంక్ ఎప్పుడు మళ్లీ మైదానంలో అడుగుపెడుతాడన్నదాంట్లో క్లారిటీ లేదు. కానీ, ఓ నివేదిక ప్రకారం.. ఫిట్నెస్ మార్గదర్శకాలను పాటించగలిగితే ఐపీఎల్-2025 రెండో దశ వరకు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఛాన్స్ ఉంది. మయాంక్ గత కొద్ది నెలలుగా గాయాలతో ఇబ్బందిపడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి మయాంక్ వార్తల్లో నిలిచాడు. గాయం కారణంగా 2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు.
కానీ, గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. దాని కారణంగా వరుసగా రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే, సైడ్ స్ట్రెయిన్ కారణంగా ఆడలేకపోయినందున కేవలం నాలుగు మ్యాచులకు దూరం కాగా.. గత సీజన్లో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాడు. లక్నో ఫ్రాంచైజీ అతనిపై నమ్మకంతో ఉన్నది. మెగా వేలానికి ముందు రూ.11కోట్లకు మయాంక్‌ను రిటైన్ చేసుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్ క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులైన జహీర్ ఖాన్, మయాంక్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. 150శాతం ఫిట్‌గా ఉండాలని తాము కోరుకుంటున్నామని.. అతన్ని అందుబాటులోకి ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఐపీఎల్ పీజన్ను మార్చి 24న విశాఖపట్నంలో తొలి మ్యాచ్ ఆడుతుంది. వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఈ సారి లక్నో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రిషబ్ పంత్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. జెడ్డాలో జరిగిన వేలంలో అతన్ని భారీ ధరకు వేలంలో దక్కించుకున్నది.