IPL 2025 Auction : ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. సౌదీ అరేబియాలో లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వేలం నిర్వహిస్తారంటూ రోజుకో వార్త ప్రచారం అవుతోంది. దాంతో, ఫ్రాంచైజీ యజమానుల్లో, అభిమానుల్లో ఒకింత గందరగోళం నెలకొంది. దీనికంతటికి కారణం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి అధికారిక ప్రకటన రాకపోవడమే. అయితే.. సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో మెగా వేలం జరగనుందని పక్కా సమాచారం ఉంది.
నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారం మెగా వేలం నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెప్పాయి. అయితే.. నవంబర్ 24, 25వ తేదీల్లో ఆటగాళ్ల వేలం పాట పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ తేదీలపై త్వరలోనే బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రతి మూడేండ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాటను నిర్వహిస్తారు. 2008 నుంచి ఈ సంప్రదాయన్ని బీసీసీఐ కొనసాగిస్తూ వస్తోంది.
ఇంతకుముందు 2022లో మెగా వేలం జరిగింది. దాంతో, ఆనవాయితీ ప్రకారం మూడేండ్ల తర్వాత అంటే 2025లో మెగా వేలం జరిపేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సిద్ధమవుతున్నాయి. 17వ సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రికార్డు ధర పలకగా.. ప్యాట్ కమిన్స్ (Pat Cummins) రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, ఈసారి కండ్లు చెదిరే ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. 18వ సీజన్‌కు ఆరుగురిని మాత్రమే రిటైన్ చేసుకొనే వీలుంది. అందుకని ప్రతి జట్టులో దాదాపు కొత్తవాళ్లు చేరే అవకాశముంది.