IPL 2025 Auction : ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు బద్ధలైంది. పంత్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది.
శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడ్డాయి. వేలం రూ.7.5 కోట్లు దాటిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలోకి వచ్చింది. రెండు జట్లు ధర పెంచుకుంటూ పోయాయి. దాంతో ఐపీఎల్ వేలంలో రూ.20 కోట్ల మార్క్ దాటిన తొలి భారత ప్లేయర్‌గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2024లో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు ధర పలికి అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
ఇప్పుడు ఆ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో రూ.25 కోట్ల మార్కు దాటిన మొదటి ఆటగాడిగా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. దాంతో స్టార్క్ రికార్డు బద్ధలైంది. ఆ తర్వాత కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ రికార్డును రిషబ్ పంత్ బద్ధలు కొట్టాడు. కాగా, ఈసారి వేలంలో మిచెల్ స్టార్క్ ధర ఘోరంగా పడిపోయింది. గత ఐపీఎల్లో రూ.24.75 కోట్ల ధర పలికిన స్టార్క్ ఈసారి 11.75 కోట్లకు అమ్ముడు పోయాడు.