Rajasthan Royals | జైపూర్: ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడుమీదున్న రాజస్థాన్ రాయల్స్ సొంత ఇలాఖాలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైని 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. సందీప్ శర్మ (5/18) ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు బౌల్ట్ (2/32) బౌలింగ్ మెరుపుల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 179 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (45 బంతుల్లో 65, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), నెహల్ వధెర (24 బంతుల్లో 49, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్, 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో 18.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. సందీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సందీప్ పాంచ్ పటాకా : టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై బౌల్ట్, సందీప్ పేస్‌కు బెంబేలెత్తిపోయింది. టాపార్డర్‌లో ఇషాన్ డకౌట్ అవగా రోహిత్ (6), సూర్య(10) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ.. నబీ (23)తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 4వ వికెట్‌కు ఈ జోడీ 32 పరుగులు జోడించింది. నబీని ఔట్ చేయడం ద్వారా రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో 200వ వికెట్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. నబీ నిష్క్రమించినా వధెర రాకతో ముంబై స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. తిలక్-వధెర రాజస్థాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి ఐదో వికెట్‌కు 99 పరుగులు జోడించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
జైస్వాల్ అదుర్స్ : ఛేదనలో రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. జైస్వాల్, బట్లర్ (35) తొలి వికెట్‌కు 7.6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న జైస్వాల్ ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. వర్షం అంతరాయం తర్వాత బట్లర్ ఔట్ అయినా సంజూ శాంసన్ ( 38 నాటౌట్) తో కలిసి రాజస్థాన్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. 30 బంతుల్లోనే 50 రన్స్ పూర్తిచేసిన అతడు.. అర్ధ శతకం తర్వాత మరింత దూకుడుగా ఆడి 59 బంతుల్లోనే ఐపీఎల్ కెరీర్లో రెండో శతకం పూర్తిచేశాడు. జైస్వాల్ బాదుడుకు తోడు ముంబై ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ రాజస్థాన్ బ్యాటర్లకు కలిసొచ్చాయి.
ముంబై : 20 ఓవర్లలో 179/9 (తిలక్ 65, వధెర 49, సందీప్ 5/18, బౌల్ట్ 2/32).
రాజస్థాన్ : 18.4 ఓవర్లలో 183/1 (జైస్వాల్ 104 నాటౌట్, సంజూ , చావ్లా 1/33)