నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-17) కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజీలో ఏడు మ్యాచ్‌లే మిగిలున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారుచేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు రేసులో ఉన్నాయి. నాకౌట్ దశకు చేరే ఆ మూడు జట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
IPL | ఢిల్లీ: ఏడు మ్యాచ్‌లు.. ఆరు జట్లు.. మూడు బెర్తులు..! ఐపీఎల్-17లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్ రద్దు అయ్యేసరికి ఉన్న సమీకరణం. అహ్మదాబాద్‌లో వర్షం కారణంగా కేకేఆర్-జీటీ మ్యాచ్ రద్దవడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ అధికారికంగా నిష్క్రమించినా రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఇంకా పోటీలోనే ఉన్నాయి. మరి టాప్-4లో నిలవాలంటే ఏ జట్టుకు అవకాశాలున్నాయి..? ఆరింటిలో ప్లేఆఫ్స్ వెళ్లే ఆ మూడు జట్లు ఏవి..?
రాజస్థాన్ రాయల్స్.. 
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అందరికంటే ముందే ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకుంటుందనుకున్న రాజస్థాన్ రెండో దశ నుంచి తడబడుతోంది. అయినా పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ (+0.349) కూడా మెరుగ్గానే ఉంది. శాంసన్ సేనకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. నేడు (మంగళవారం) ఢిల్లీ-లక్నో మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే రాజస్థాన్ బెర్తును ఖాయం చేసుకున్నట్టే. ఒకవేళ లక్నో గెలిచినా రాయల్స్ తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఒకటి నెగ్గితే ఆ జట్టు నాకౌట్ దశకు చేరుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్.. 
రెండ్రోజుల క్రితం రాజస్థాన్‌తో మ్యాచ్ గెలవడం చెన్నై ఆశలను సజీవంగా ఉంచింది. ఏడు విజయాలు 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న సీఎస్కే.. +0.528 రన్‌రేట్‌తో మెరుగైన స్థానంలోనే ఉంది. ఆ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌ను ఈనెల 18న బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ఈ పోరులో నెగ్గితే సీఎస్కే ఖాతాలో 16 పాయింట్లు చేరతాయి. ఒకవేళ ఓడినా హైదరాబాద్, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడితే ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్.. 
ఉప్పల్‌లో లక్నోపై భారీ విజయం హైదరాబాద్‌కు కలిసొచ్చింది. ఎస్ఆర్హెచ్ ఖాతాలో 14 పాయింట్లు ఉండగా ఆ జట్టు మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా హైదరాబాద్ టాప్-4లో నిలుస్తుంది. రెండూ గెలిస్తే టాప్-2కు వెళ్లే అవకాశం లేకపోలేదు. అలాకాకుండా రెండు మ్యాచ్‌లలో ఓడితే మాత్రం చెన్నై, బెంగళూరు (సీఎస్కేపై గెలిస్తే), లక్నో.. ఎస్ఆర్హెచ్ను అధిగమించే ప్రమాదమూ పొంచిఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 
ఈ సీజన్ తొలి దశలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి అసలు అందరికంటే ముందే బిస్తరు సర్దేస్తుందనుకున్న ఆర్సీబీ అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకురావడం ఆశ్చర్యమే. వరుసగా ఐదు విజయాలతో 12 పాయింట్లు ఖాతలో ఉన్న బెంగళూరు.. 18న సొంతగడ్డపై చెన్నైని ఢీకొనాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ ఛేదనకు దిగాల్సి వస్తే లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ సైతం ప్లేఆఫ్స్ రేసులోకి వస్తుంది. అయితే అంతకంటే ముందే.. హైదరాబాద్, లక్నో తాము తర్వాత ఆడబోయే మ్యాచ్‌లలో గెలిస్తే బెంగళూరుకు మరోసారి వామహస్తమే.
ఢిల్లీ క్యాపిటల్స్.. 
బెంగళూరు చేతిలో ఓటమి ఢిల్లీని దారుణంగా దెబ్బతీసింది. అనధికారికంగా ఆ జట్టు టాప్-4 రేసులో లేకున్నా.. లక్నోతో మ్యాచ్‌లో గెలిచి లక్నో, హైదరాబాద్ తమ మిగిలిగిన మ్యాచ్‌లలో ఓడితే అప్పుడు ఢిల్లీకి అవకాశముంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్.. 
హైదరాబాద్‌తో పరాజయం లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలకు అడ్డుకట్ట వేసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానం (12 పాయింట్లు)లో ఉన్న రాహుల్ సేన.. మరో రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లకు చేరుతుంది. అది కూడా భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ (ప్రస్తుతం -0.769) మెరుగుపరుచుకోవాలి. అదే సమయంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ మ్యాచ్‌లలో పరాభవాలు ఎదుర్కుంటే లక్నోకు ఛాన్స్ ఉంటుంది.
