IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో నిలిచేందుకు ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. సీజన్ చివరి దశకు వచ్చినా కూడా ప్లే ఆఫ్స్ బెర్తులు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దాంతో, రేసులో నిలిచే జట్లు ఏవి? అనే ఆసక్తి క్రికెట్ అభిమానులందరిలో మొదలైంది. ఎందుకంటే.. ప్రస్తుతానికి తొమ్మిది మ్యాచ్‌లు మిగిలాయంతే. దాంతో, ఏ జట్లు రేసులో నిలుస్తాయి? అనేది పరిశీలిద్దాం..
ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ వైదొలిగింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఒక మ్యాచ్ గెలిచినా లేదా రెండో స్థానంలో ఉన్న సీఎస్కే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా గుజరాత్ జట్టు ఎంచక్కా ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ఐపీఎల్ ట్రోఫీతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
16 పాయింట్లు ఉన్న గుజరాత్ రెండు మ్యాచుల్లో ఓడిపోయి లక్నో, సీఎస్కే గెలిస్తే 17 పాయింట్లతో మొదటి, రెండో స్థానాల్లో నిలుస్తాయి. దాంతో, గుజరాత్, ముంబై, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు మిగతా రెండు బెర్తుల కోసం పోటీపడతాయి. గుజరాత్ – 13 మ్యాచుల్లో 8 విజయాలతో 15 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు 0.761 ఉంది.
All eyes 👀 on the 𝙋𝙤𝙞𝙣𝙩𝙨 𝙏𝙖𝙗𝙡𝙚!
At the end of Match 6️⃣1️⃣ of #TATAIPL 2023, here’s how the Points Table stands! 🙌
Which position is your favourite team on currently? 🤔 pic.twitter.com/WWqob5cAA1
— IndianPremierLeague (@IPL) May 14, 2023
టేబుల్లో రెండో స్థానంలో ఉన్న సీఎస్కేకు ఇంకా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కలేదు. తర్వాత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గినా కూడా టాప్ 2 లో ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేం. అలాకాకుండా ఓడిపోతే మాత్రం ఆ జట్టు రేసులో వెనకబడుతుంది. మిగతా ఐదు జట్లకు (గుజరాత్, ముంబై, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో) 15 పాయింట్లు సాధిస్తే సీఎస్కేకు ఢోకా ఉండదు. మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ చేరుతుంది. సీఎస్కే.. 13 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు 0.0381 ఉంది
ఓటమితో టోర్నీని ఆరంభించి ఆ తర్వాత పుంజుకున్న ముంబై ప్లే ఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారింది. ఆఖరి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. తర్వాతి రెండు మ్యాచుల్లో గెలిస్తే రోహిత్ సేన టాప్ 4లో ఉంటుంది. ఒకవేళ ఒక గేమ్ ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేటు కీలకం అవుతాయి. రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ చాన్స్ తక్కువ. 15 పాయంట్లతో నాలుగో బెర్తు కోసం 4 జట్లతో పోటీ పడాల్సి వస్తుంది. ముంబై ఆడిన13 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు (-0.117) మైనస్‌లో ఉంది.
లక్నో టీమ్‌కు తర్వాతి రెండు మ్యాచ్‌లు నిజంగా చావోరేవో. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు కచ్చితంగా రెండింటిలో గెలవాలి. ఒక గేమ్ గెలిచినా నెట్ రన్‌రేటుతో సంబందం లేకుండా పోటీలో ఉంటుంది. గుజరాత్, సీఎస్కే, ఆర్సీబీ, ముంబై జట్లు 16 లేదా 17 పాయింట్లతో ఉంటే లక్నోకు కష్టమే. రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం ఇంటిదారి పడుతుంది. లక్నో 12 మ్యాచుల్లో 6 గెలిచి 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు (0.309) మెరుగ్గానే ఉంది.
ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల తేడాతో గెలవడంతో నెట్ రన్‌రేటు మైనస్ (-0.345) నుంచి ప్లస్(0.166)కు చేరింది. దాంతో, ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడ్డాయి.ముంబై, పంజాబ్ కంటే మంచి రన్‌రేటు ఉండడం ఆర్సీబీకి కలిసి రానుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఒకటి గెలిస్తే మాత్రం డూప్లెసిస్ సేనన అవకాశాలు మిగతా జట్ల గెలుపు, ఓటములపై ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ 12 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
గత సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో అదరగొట్టింది. కానీ, వరుస ఓటములతో మొదటి స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై భారీ ఓటమి ఆజట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. నెట్ రన్‌రేటు 0.633 నుంచి అనూహ్యంగా 0.140 వచ్చింది. అయినా తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే రాజస్థాన్‌కు చాన్స్ ఉంది. అదెలాగంటే..? ఆర్సీబీ, లక్నో, పంజాబ్ తమ తర్వాతి రెండు గేమ్స్‌లో ఓడిపోవాలి. హైదరాబాద్ రెండు మ్యాచు(గుజరాత్, ముంబై)ల్లో ఒక్కటి ఓడాలి. దాంతో నాలుగో స్థానం కోసం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య పోటీ ఉంటుంది. శాంసన్ సేన 12 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. రింకూ సింగ్, నితీశ్ రానా ఆదుకోవడంతో చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో, ఏడో స్థానానికి చేరింది. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తర్వాతి మ్యాచ్‌లో లక్నోపై కచ్చితంగా నెగ్గాలి. అంతేకాదు ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై, పంజాబ్‌కు 14 కంటే ఎక్కువ పాయింట్లు రాకుంటే కోల్‌కతాకు అవకాశం ఉంది. 13 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. అయితే.. నెట్ రన్‌రేటు మైనస్‌లో (-0.256) ఉండడం ఈ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో ఉంది. తర్వాతి రెండు మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. అయితే.. ఈ రెండు కూడా సొంత గ్రౌండ్లో కాదు. వీటిలో ఒక్కటి ఓడినా మిగతా జట్ల మ్యాచ్‌ల రిజల్ట్ కోసం వేచి చూడాలి. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై, కోల్‌కతాతో పోటీ ఎదురవుతుంది. 12 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉంది. నెట్ రన్‌రేటు మైనస్(-0.268)లో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అంతంత మాత్రం ఆటతో అడుగున ఉంది. అయినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఆ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. మూడుకు మూడు గెలిస్తే 14 పాయింట్లు వస్తాయి. దాంతో, ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతుంది. లక్నో తర్వాతి రెండు గేమ్స్‌లో విజయం సాధిస్తే గుజరాత్, చెన్నైకి 14 కంటే ఎక్కువ పాయింట్లతో టాప్ -3లో నిలుస్తాయి. దాంతో, ఆఖరి బెర్త్ కోసం ముంబై, పంజాబ్‌తో హైదరాబాద్ పోటీ పడాల్సి వస్తుంది. ఒకవేళ లక్నో రెండు మ్యాచుల్లో ఓడితే.. నాలుగో ప్లేస్ కోసం హైదరాబాద్, పంజాబ్, కోల్‌కతా మధ్య హోరాహోరీ తప్పదు. అప్పుడు నెట్ రన్‌రేటు కీలకం అవుతుంది.