మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య బాక్సింగ్ డే టెస్టుకు సమయం ఆసన్నమైంది. 11 రోజుల వ్యవధిలో యాషెస్ సిరీస్‌ను తిరిగి ఒడిసిపట్టుకున్న ఆసీస్..మిగిలిన రెండు టెస్టుల్లోనూ దుమ్మురేపాలని పట్టుదలతో ఉంది. శుక్రవారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టుకు ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ దూరం కాగా, పిచ్‌ను ముందే అంచనా వేసిన ఆసీస్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది.
పచ్చికతో కళకళలాడుతున్న మెల్బోర్న్ పిచ్‌పై పటిష్టమైన పేస్ దళంతో ఇంగ్లండ్ జట్టును దెబ్బతీయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా నాలుగేండ్ల తర్వాత జే రిచర్డ్సన్ తిరిగి జట్టులోకి చోటు దక్కించుకోగా, బ్రెండన్ డగెట్, మిచెల్ నెసెర్ లాంటి యువ బౌలర్లు సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. మరోవైపు సిరీస్ చేజార్చుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్.. బెతెల్‌ను జట్టులోకి తీసుకుంది.