న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతటి రాజనీతిజ్ఞులో ఆయనలో అంతకుమించిన పదునైన చమత్కారం, హాస్యం నిత్యం తొణికిసలాడుతుంటాయి. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ ప్రధాని అలవోకగా విసిరే హాస్యపూరిత చెణుకులను గుర్తుచేసుకున్నారు. వాజ్‌పేయి పదవీకాలంలో అపురూప ఘట్టాలలో 1999 ఫిబ్రవరిలో జరిగిన లాహోర్ బస్సు యాత్ర ఒకటి. అణు పరీక్షల అనంతరం ఉభయ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఈ సందర్భంగా లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం జరిగింది.
ఆ సమయంలో ఆసక్తికర ఘటనను రాజ్‌నాథ్ పంచుకున్నారు. వాజ్‌పేయి ప్రసంగానికి ముగ్ధురాలైన ఓ పాకిస్థానీ అవివాహిత తనను వివాహం చేసుకోవాలని ఆయనను కోరింది. తనకు బహుమతిగా కశ్మీరును ఇవ్వాలని ఆ మహిళ కోరడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె ప్రతిపాదనకు ఏమాత్రం తొణకని వాజ్‌పేయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం. అయితే కట్నంగా నాకు మొత్తం పాకిస్థాన్‌ను ఇచ్చేయాలి అంటూ షరతు పెట్టారు. ఇది వాజ్‌పేయిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.