సిద్దిపేట, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. ధరణి కంటే మెరుగైన సేవలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, మిస్సింగ్ సర్వేనంబర్లు, భూ వర్గీకరణలో తప్పులు, పట్టాదారు పుస్తకాల్లో పేర్ల తప్పులు, వీటిని సవరణ చేయడానికి రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, ఒక్క దరఖాస్తు పరిష్కారం కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులను విచారణ చేయడం లేదు.
క్షేత్రస్థాయిలో విచారణ చేసి రికార్డుల ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కానీ, అలా జరగడం లేదు. నిర్ణయం తీసుకునేందుకు నెలల తరబడి అధికారులు తిప్పుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భూ సమస్యలపై కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు మూడు నెలల కింద పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు తప్పు పడిందని, దానిని సవరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆపని పూర్తి కాలేదు. భూభారతితో సత్వరం పరిష్కరిస్తామని చెప్పడం తప్పా పనులు కావడం లేదని రైతులు వాపోతున్నారు. సమస్య చిన్నదైనా పరిష్కారం చూపడం లేదు. భూ సమస్యలపై స్వయంగా కలెక్టర్‌కు విన్నవించినా పరిష్కారం కావడం లేదని రైతులు చెబుతున్నారు.
భూభారతి కింది సిద్దిపేట జిల్లాలో 43,276 దరఖాస్తులు వచ్చాయి.వీటిలో 14,200 వరకు పరిష్కారమయ్యాయి. మిగిలినవవి పెండింగ్‌లో ఉన్నాయి. మెదక్ జిల్లాలో 35,125 దరఖాస్తులు రాగా, వీటిలో 31,081 పరిష్కారమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 16,136 దరఖాస్తులు రాగా, వీటిలో 5,214 పరిష్కారమయ్యాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 94,537 దరఖాస్తులు రాగా వీటిలో 50,495 పరిష్కారమయ్యాయి. మిగతా 44,042 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కన్నా మెదక్ జిల్లాలో కొంత మేర దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతున్నాయి.ఆయా జిల్లాల్లో వివిధ స్టేజీలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవో లాగిన్, అక్కడి నుంచి రెవెన్యూ, కలెక్టర్ ఇలా ఫైళ్లు వెళ్తున్నాయి.నెలల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ భూముల వివరాలను 22(ఎ)లో నమోదయ్యాయి. ఫౌతి మ్యుటేషన్ సమయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదిక పంపాలి. దీనికి స్థానిక ఆర్ఐ, ఇతర అధికారులు నానా కొర్రీలు పెడుతున్నారు. అక్కడ ఉన్న భూమి ఆధారంగా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు ముట్టజెప్పితేనే నివేదిక తయారు చేసి తహసీల్దార్‌కు పంపుతున్నారు. అక్కడి నుంచి ఆర్డీవో, అదనపు కలెక్టర్‌కు ఫైల్ చేరుతున్నది. బుక్ చేసిన స్లాట్ ప్రకారం ఫౌతి రిజిస్ట్రేపన్ చేస్తున్నారు.భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినా నెలల తరబడి పాస్ బుక్కులు రైతులకు అందడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు తహసీల్ కార్యాలయాల్లో రోజురోజుకూ అవినీతి పెరిగిపోతున్నది. ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని అందినకాడికి అధికారులు దోచుకుంటున్నారు. కొంతమంది రైతులు తమ సాగు భూములను వ్యవసాయేతర అవసరాల కోసం రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అమాయక రైతుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఐదు గుంటల లోపు స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో పూర్తి వివరాలు సేకరించాలని మౌఖిక అదేశాలు ఉన్నాయి.
దీనిని ఆసరాగా చేసుకొని గంటల్లో చేపట్టే స్థలాల రిజిస్ట్రేషన్లకు అనేక కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. నేరుగా రైతులు పోతే పని కావడం లేదు. పలు కారణాలు చూపెడుతూ తిరస్కరిస్తున్నారు. ఇలా తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించిన వ్యక్తులు దళారీలను ఆశ్రయించగానే చకచకా పనులు అయిపోతున్నాయని జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తులతో డీల్ కుదిరాక ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గుంటల్లో ఉన్న సాగు రిజిస్ట్రేషన్లకు భారీగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు తహసీల్ కార్యాలయాల వద్ద ఈ తంతు జోరుగా సాగుతోంది.
సిద్దిపేట జిల్లాలో ఓ రైతు 5 గుంటల భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించడానికి తహసీల్ కార్యాలయానికి వెళ్తే అనేక కొర్రీలు పెట్టారు. భూమిపై రుణం ఉందని..ఇది బకెట్లో ఉందని, ఇలా ఏవేవో కొర్రీలు చెప్పి తిప్పిపంపారు. ఆ రైతుకు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న ఒక దళారీని ఆశ్రయించాడు.. నీ పని చేపిస్తా ఇంత ఇయ్యాలి అని మాట్లాడుకున్నాడు. ఆఫైల్ తీసుకువెళ్లి లోపల సంబంధిత అధికారితో మాట్లాడి వచ్చి రైతును తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించాడు. అడిగిన కాడికి రైతు చెల్లించాడు. ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు.