టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్‌పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉండగా.. ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా సంగక్కర సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ జట్టు కెప్టెన్ గురించి సంగక్కర మాట్లాడాడు.
క్లబ్‌హౌస్‌లో రెడ్ బుల్ క్రికెట్లో మాట్లాడుతూ.. శాంసన్‌ది చాలా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అని, అలాగే మంచి కెప్టెన్సీ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పాడు. అందుకే మెగా వేలం ముందు అతన్ని రిటైన్ చేసుకోవడానికి అసలు ఆలోచించలేదన్నాడు. ‘‘అతను కెప్టెన్ అయినా కాకున్నా.. రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తుతో సంబంధం లేకున్నా.. టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు’’ అంటూ సంజూను కొనియాడాడు.
తనకు ఇంకా ఆట గురించి పూర్తిగా తెలియదని అంగీకరించే మనస్తత్వం సంజూకు ఉందని, అదే సమయంలో అతను అద్భుతమైన కెప్టెన్సీ లక్షణాలు కనబరిచాడని చెప్పాడు. గడిచిన రెండు సీజన్లలో ఆర్ఆర్ తరఫున సంజూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.