10 జట్లు..13 నగరాలు, 64 రోజులు..74 మ్యాచ్‌లు. ఐపీఎల్ 18వ సీజన్ గురించి క్లుప్తంగా ఇది. మండు వేసవిలో సాయంకాలం సమయాన ఇంటిల్లిపాదిని అలరించేందుకు ఐపీఎల్ అన్ని హంగులతో ముస్తాబైంది. రెండు నెలల పాటు అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్లేందుకు ఐపీఎల్ రానే వచ్చింది. నేటి నుంచి మొదలయ్యే ఈ టీ20 ధనాధన్ ధమాకాలో తడిసిముద్దయ్యేందుకు ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠ ఊపేసే పొట్టి పోరులో బ్యాటర్ల వీరబాదుడుతో హోరెత్తే పరుగుల వరదకు, కండ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు, వీరోచిత బౌలింగ్ ప్రదర్శనలు. వెరసి పది జట్లు కొదమసింహాల్లా కొట్లాడే లీగ్‌లో అభిమానులకు పసందైన విందు ఖాయమనిపిస్తున్నది. దేశాల సరిహద్దులు చెరిపేస్తూ సహచరులు ప్రత్యర్థులుగా తలపడే లీగ్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గతానికి భిన్నంగా కొత్త మార్పులతో రాబోతున్న ఐపీఎల్-2025 రికార్డుల హోరుకు వేదిక కాబోతున్నది. టైటిల్ గెలుపే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగనున్నజట్లు ఏ మేరకు ప్రయత్నాల్లో సఫలమవుతాయో అన్నది చూడాలి.
IPL | కోల్‌కతా: క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ షడ్రుచోపేతమైన వింధు భోజనం అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ సిద్ధమైంది. నిండు వేసవిలో భానుడి భగభగల నడుమ బౌండరీల జడివానలో తడుస్తూ, సిక్సర్ల సునామీలో మునిగి తేలుతూ అసలైన టీ20 మజాను ఆస్వాదించడానికి ధనాధన్ టీ20 వేడుకకు శనివారం తెరలేవనుంది. అంతర్జాతీయ స్టార్లు, దేశీయ వర్ధమాన క్రికెటర్ల కలబోతలో బంతిని కసిగా బాదే హిట్టర్లు, మెరుపు వేగంతో భయపెట్టే పేసర్లు, ప్రత్యర్థులను తమ స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టే స్పిన్ మాయగాళ్లు, ఆల్‌రౌండర్ల మెరుపులు, ఫీల్డర్ల అత్యద్భుత విన్యాసాలు.. వెరసి మార్చి 22 నుంచి మే 25 వరకూ ఏకంగా 65 రోజుల పాటు జరిగే ప్రపంచ అతిపెద్ద క్రికెట్ పండుగ నేటి నుంచి మొదలుకాబోతుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో టోర్నీలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌తో 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమవనుంది. రెండు నెలల పాటు పది పటిష్టమైన జట్ల మధ్య జరుగబోయే ఈ టోర్నీలో కొత్త విజేతను చూస్తామా? లేక మాజీ చాంపియన్లే మళ్లీ కప్పును ఎగురేసుకుపోతారా? అన్నది ఆసక్తికరం!
నవ సారథులు రాత మారుస్తారా?
ఈసారి ఐపీఎల్లో ఐదు జట్లు కొత్త సారథుల నేతృత్వంలో బరిలోకి దిగబోతున్నాయి. పదేండ్ల తర్వాత తమకు ట్రోఫీ అందించినా కోల్‌కతా శ్రేయస్‌ను పక్కబెట్టడంతో అతడిని పంజాబ్ భారీ ధరకు ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. 17 సీజన్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న తమ కలను శ్రేయస్ నెరవేర్చి తమను ‘కింగ్స్’గా మార్చుతాడని ఆ జట్టు గంపెడాశలతో ఉంది. 18వ సీజన్లో అయినా టైటిల్ నెగ్గేందుకు బెంగళూరు.. రజత్ పాటిదార్ మీద భారీ ఆశలే పెట్టుకుంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, లక్నోను రిషభ్ పంత్ ఏ మేరకు ఒడ్డుకు చేరుస్తారనేది చూడాలి. ఈ నాలుగు జట్లూ ఇంతవరకూ ఐపీఎల్లో ట్రోఫీ గెలవని జాబితాలో ఉన్నవే. ఇక కోల్‌కతా తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు గాను సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకు ఆ బాధ్యతలు అప్పగించింది. సారథులను మార్చకున్నా తమ ఆరంభ మ్యాచ్‌లలో ముంబై (సూర్యకుమార్), రాజస్థాన్ (రియాన్ పరాగ్) తాత్కాలిక సారథుల ఆధ్వర్యంలో సీజన్‌ను ఆరంభించనున్నాయి.
‘రోకో’ తొలిసారిగా..
ఆధునిక భారత క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. తమ అంతర్జాతీయ టీ20 కెరీర్లకు వీడ్కోలు పలికిన తర్వాత ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇదే. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి లీగ్ ఆడుతున్న ఈ సీనియర్లకు ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు సువర్ణావకాశం. ముంబైకి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్.. గత సీజన్లో సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి 14 మ్యాచ్‌లలో 32.08 సగటుతో 417 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగుల (8,004 రన్స్) వీరుడైన కోహ్లీ.. 2024లో 15 మ్యాచ్‌లలో ఏకంగా 61.75 సగటుతో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ ద్వయం మంచి ఫామ్‌లోనే ఉండటం శుభపరిణామం. మరి ఈసారి ‘రోకో’ ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి. రోహిత్, కోహ్లీతో పాటు ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచీ ఆడుతున్న దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడా? లేక గత మూడు సీజన్ల మాదిరిగానే ‘ఐయామ్ నాట్ ఎట్ ఫినిష్డ్’ అంటాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!
హైదరాబాద్‌లో ప్లేఆఫ్స్
దేశంలోని 13 నగరాల్లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్లో 74 మ్యాచ్ (70 లీగ్, 4 నాకౌట్)లు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనబోయే పది జట్లను రెండు గ్రూపులు విభజించారు. గ్రూప్-ఏలో చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా గ్రూప్-బీలో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 22 నుంచి మే 18 వరకూ లీగ్ మ్యాచ్‌లు జరుగనుండగా, మే 20 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. సన్‌రైజర్స్ ఆడే లీగ్ మ్యాచ్‌లతో పాటు తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్కూ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో 18వ సీజన్‌కు తెరపడనుంది.
ఈ సారి మరింత కొత్తగా..
ఏ యేటికాయేడు కొత్త సొబగులు అద్దుకుంటూ ప్రపంచంలోనే ‘బిగ్గెస్ట్ లీగ్’గా గుర్తింపు పొందుతున్న ఐపీఎల్.. 2025లో మరింత కొత్తగా ముస్తాబైంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఈసారి బౌలర్లూ సత్తా చాటేందుకు తీసుకొచ్చిన పలు నిబంధనలు కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ కాబోతున్నాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మి రాయడంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయడం పేసర్లకు ఎంతగానో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. రాత్రిపూట జరిగే మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత ‘బంతి మార్పు’ కూడా ఫీల్డింగ్ జట్లకు వరం వంటిదే. మంచు కారణంగా పాత బంతితో మ్యాచ్‌పై ‘పట్టు’ కోల్పోకుండా ఉండటంలో ఇది కీలకం కానుంది. ఆఫ్‌స్టంప్, హైట్ వైడ్స్ కు హాక్ఐ టెక్నాలజీని ఉపయోగించుకునేలా అవకాశం కల్పించడం బౌలర్లకు కలిసొచ్చేదే. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదాన్నీ తొలగించడం సారథులకు భారీ ఉపశమనం.
వరుణుడు ఏం చేసేనో?
కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం మ్యాచ్ సమయానికి కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం 90 శాతంగా ఉందని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తుండటం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. గత మూడు రోజులుగా కోల్‌కతాలో వర్షాలు కురుస్తుండగా గురువారం కేకేఆర్ ఇంట్రాస్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ సైతం వర్షం కారణంగా రైద్దెంది. శుక్రవారం సాయంత్రం ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్ కూడా వాన వల్ల రద్దు అయినట్టు సమాచారం. మరి మ్యాచ్ సమయానికి వరుణుడు శాంతిస్తాడా లేదా అన్నది చూడాలి.