న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘం రిలీజ్ చేసింది. 117 మంది అథ్లెట్లు ఈసారి మెగా క్రీడల్లో దేశం తరపున పోటీపడనున్నారు. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది సపోర్ట్ సాఫ్ట్ కూడా వెళ్తుందని ఐఓఏ వెల్లడించింది. మొత్తం భారత బృందంలో 72 మంది మాత్రం ప్రభుత్వం తన ఖర్చులను భరించనున్నది. అయితే పారిస్ వెళ్తున్న బృందంలో.. ఒలింపిక్స్ అర్హత సాధించిన షాట్ పుట్ క్రీడాకారణి అభా ఖతువాకు చోటు దక్కలేదు. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటా ద్వారా ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కానీ వరల్డ్ అథ్లెటిక్స్ జాబితా నుంచి ఆమె పేరును తప్పించడంతో.. భారత ఒలింపిక్ బృందం నుంచి కూడా ఖతువా పేరును తొలగించారు.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాకు.. కేంద్ర క్రీడాశాఖ నుంచి లేఖ అందింది. అథ్లెట్ల అవసరాలు, అదనపు కోచ్‌లు, ఇతర సపోర్ట్ స్టాఫ్ కోసం.. కేంద్ర ప్రభుత్వం 72 మందికి అనుమతి ఇచ్చినట్లు ఆ లేఖలో తెలిపారు. అథ్లెటిక్స్ లో ఈసారి 29 మంది పోటీపడుతున్నారు. దాంట్లో 11 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. ఆ తర్వాత షూటింగ్‌కు 21 మంది, హాకీలో 19 మంది ఉన్నారు.
టేబుల్ టెన్నిస్‌లో 8 మంది , బ్యాడ్మింటన్‌లో ఏడు మంది పోటీపడుతున్నారు. రెండుసార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధు ఈ లిస్టులో ఉంది.
రెజ్లింగ్‌లో ఆరుగురు, ఆర్చరీలో ఆరుగురు, బాక్సింగ్‌లో ఆరుగురు ఒలింపిక్స్‌కు వెళ్తున్నారు. గోల్ఫ్ ఆటలో నలుగురు, టెన్నిస్‌లో ముగ్గురు, స్విమ్మింగ్‌లో ఇద్దరు, సెయిలింగ్‌లో ఇద్దరు పోటీలకు వెళ్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో 119 మంది భారత బృందం పాల్గొన్నది. ఆ క్రీడల్లో ఏడు మెడల్స్ సాధించింది ఇండియా. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్ వచ్చిన విషయం తెలిసిందే.