IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్ట్రేడియంలో జరుగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్‌పై పలువురు మాజీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు ఇంజమామ్ ఉల్ హక్, షాహిద్ ఆఫ్రిది, యువరాజ్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి దిగ్గజాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజమామ్ ఉల్ హక్ భారత్-పాక్ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో జోష్యం చెప్పారు. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందన్నారు.
సంవత్సరానికి ఒకేసారి మ్యాచ్ జరుగుతుండడంతో ఒత్తిడి పెరుగుతుందని.. చాలా మ్యాచులు జరిగితే ఆటగాళ్లు ఒకరినొకరు దగ్గరగా ఉంటారని పేర్కొన్నారు. మ్యాచ్‌లో ఏ జట్టు సమతూకంగా ఉంటుందో.. ఆ జట్టు మ్యాచ్‌లో పైచేయి సాధించేదని.. టీ20 క్రికెట్ కారణంగా ఆట వ్యక్తిగతంగా మారిందన్నారు. ఒక ఆటగాడే మ్యాచ్ గమనాన్నే మారుస్తున్నాడని చెప్పారు. ఇటీవల భారత జట్టు బలంగానే ఉందన్నారు. ముఖ్యమంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ల కారణంగా లోయర్ ఆర్డర్లో జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సారి మ్యాచ్‌లో అన్నింట్లో సమతూకంగా ఉన్న జట్టే పైచేయి సాధిస్తుందని చెప్పారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇంజమామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ప్లేయర్ బెస్ట్ ప్లేయర్స్ అనడంలో సందేహం లేదని.. ఇద్దరూ దాదాపు 20 సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్నారని.. జట్టుపై వీరిద్దరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపాడు.
వీరిద్దరు త్వరగా అవుట్ అయితే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో గణనీయంగా మార్పు ఉంటుందని.. దాంతో పాక్ జట్టు మనోధైర్యం పెంచుతుందని మాజీ కెప్టెన్ పేర్కొన్నారు. మిగతా భారత ఆటగాళ్లు బాగా ఆడరనేది దానర్థం కాదని.. టీమిండియాలో చాలామంది ప్రతిభావంతులైన ప్లేయర్స్ ఉన్నారని.. వారంతా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారన్నారు. పాక్ ఆటగాడు బాబర్ ఆజం త్వరగా అవుట్ అయితే.. ప్రత్యర్థి బౌలర్ల అంచనాలు పెరుగుతాయని.. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒత్తిడి పెరుగుతుందన్నారు. పాకిస్తాన్ గెలవాలంటే.. లోయర్, మిడిల్ ఆర్డర్ రాణించాలని.. రోహిత్, విరాట్ ఇద్దరి వికెట్లను త్వరగా తీస్తే.. పాకిస్థాన్‌కు లాభిస్తుందని ఇంజమామ్ వివరించారు.