న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్‌కే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేసింది. వన్డే సిరీస్ కోసం శుక్రవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించిన కమిటీ.. ఏస్ పేసర్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ను సెలెక్షన్ పరిగణనలోకి తీసుకోని కమిటీ.. టెస్టు సిరీస్‌లో దుమ్మురేపుతున్న సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో పాటు ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించింది. ‘రోహిత్ ఇంకా కోలుకోలేదు. రాహుల్‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అని చేతన్ అన్నాడు. ఓపెనర్ శిఖర్ ధవన్‌పై నమ్మకముంచిన సెలెక్టర్లు.. విజయ్ హజారే టోర్నీలో పరుగుల వరద పారించిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌కు జట్టులో చోటు కల్పించారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధవన్, గైక్వాడ్, కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయస్, వెంకటేశ్, పంత్, ఇషాన్, చాహల్, అశ్విన్, సుందర్, బుమ్రా, భువనేశ్వర్, దీపక్, ప్రసిద్ధ్, శార్దూల్, సిరాజ్.