INDvsSA 2nd Test : భారత్ – దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలను 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బాటలోనే పయనిస్తోంది. లంచ్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. టీ విరామానికి 24 ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ప్రొటీస్ సంచలనం నండ్రె బర్గర్.. తన పేస్‌తో మరోసారి భారత బ్యాటర్లను పెవిలియన్‌కు పంపుతున్నాడు. దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు పడగొడితే అందులో మూడు బర్గర్కే దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 56 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.
సౌతాఫ్రికాను అత్యల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ ఆనందం మూడో ఓవర్లోనే ఆవిరైంది. కగిసొ రబాడ.. మూడో ఓవర్లో తొలి బంతికే జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ పిచ్‌పై సఫారీ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని తేలిపోయింది. తొలి టెస్టులో విఫలమైన సారథి రోహిత్ శర్మ (50 బంతుల్లో 39, 7 ఫోర్లు).. సెంచూరియన్‌తో పోలిస్తే సాధికారికంగానే ఆడాడు. గిల్ (55 బంతుల్లో 36, 5 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.
బర్గర్తో పాటు ఎంగిడి, జాన్సెన్ల బౌలింగ్‌లో బౌండరీలు కొట్టిన రోహిత్‌ను బర్గర్ బలిగొన్నాడు. అతడు వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి హిట్‌మ్యాన్.. గల్లీలో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీతో జతకలిసిన గిల్.. మూడో వికెట్‌కు 33 పరుగులు జతచేశాడు. బర్గర్ వేసిన 21వ ఓవర్లో తొలి బంతినే బౌండరీకి తరలించిన గిల్.. ఆఖరి బంతికి గల్లీలో ఉన్న జాన్సెన్ చేతికి చిక్కాడు. అతడి స్థానంలో వచ్చిన శ్రేయస్.. పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. శ్రేయస్ కూడా బర్గర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. టీ విరామానికి వెళ్లే సమయానికి భారత్.. 24 ఓవర్లలో 111 పరుగులు చేయగా కోహ్లీ (20 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (0 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నిలిస్తేనే భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది.