INDvsNZ: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 15న భారత జట్టు.. ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి సెమీఫైనల్లో ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ముంబైకి చేరుకుని ప్రాక్టీస్ షురూ చేశాయి. బుధవారం జరుగబోయే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుఉందా..? ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దు కావాల్సిందేనా..? ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా..? వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.
వాతావారణం ఇలా..
తొలి సెమీస్ జరుగబోయే వాంఖెడేలో బుధవారం వర్షం కురిసే అవకాశాలైతే లేవని ‘వెదర్.కామ్’ స్పష్టం చేసింది. ఆ రోజంతా వాతావరణం తేమగా ఉంటుందని, వేడి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 35 సెంటిగ్రేడ్ల నుంచి 25 సెంటిగ్రేడ్ మధ్య ఉండనున్నాయని పేర్కొంది. మ్యాచ్ జరిగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా వర్షం కురిసే అవకాశాలైతే ససేమిరా లేవని తేటతెల్లం చేసింది. అయితే పగటి పూట తేమ 35 శాతంగా ఉండగా చీకటి పడే కొద్దీ పెరగనుంది. రాత్రి 7 గంటలకు 55 శాతం, పదిగంటలకు 57 శాతం ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఒకవేళ వర్షం పడితే..?
బుధవారం వాంఖెడేలో వర్షం పడే అవకాశాలు లేకున్నా ఒకవేళ ప్రకృతి ప్రతాపం చూపిస్తే మాత్రం నాకౌట్ మ్యాచ్‌ల (రెండు సెమీస్, ఒక ఫైనల్)కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ బుధవారం వర్షం కారణంగా ఆట సాగకపోయినా గురువారం మ్యాచ్ నిర్వహిస్తారు. గురువారం కూడా ఆట సాధ్యం కాకుంటే మాత్రం పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అలా జరిగితే భారత్‌కే ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. లీగ్ దశలో ఆడిన తొమ్మిదింటిలో తొమ్మిది గెలిచిన భారత్.. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 9 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచిన కివీస్‌కు 10 పాయింట్లున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా ఈ రెండు జట్ల మధ్యే తొలి సెమీస్ జరిగింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు మారిన ఆ మ్యాచ్‌లో పలితం భారత్‌కు అనుకూలంగా రాలేదు.