జకర్తా: ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మరో బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి సిద్ధమైంది. జకర్తా వేదికగా మంగళవారం నుంచి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌కు తెరలేవనుంది. ఈ ఏడాది మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ తర్వాత జరుగనున్న ఈ టోర్నీలో ప్రపంచ 9వ ర్యాంకు భారత జోడీ సెమీస్ గండాన్ని (గత రెండు ఈవెంట్లలోనూ సెమీస్‌లో ఓడారు) దాటాలని పట్టుదలతో ఉంది.
భారీ అంచనాలతో ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన పీవీ సింధు.. స్వదేశంలో నిరాశపరచినా ఇక్కడైనా పుంజుకోవాలని భావిస్తోంది. సింధుతో పాటు మాళవిక, ఆకర్షి, అనుపమ బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, రజావత్ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి. స్వల్ప విరామం తర్వాత కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలో ఆడనున్నాడు. అయితే అతడు మెయిన్ డ్రాకు అర్హత సాధించలేదు. శ్రీకాంత్‌తో పాటు కిరణ్ జార్జి సైతం అర్హత రౌండ్ల ద్వారా ఈ టోర్నీ బరిలో నిలిచారు. మహిళల డబుల్స్ భారాన్ని అశ్విని-తనీషా మోయనున్నారు.