న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్(బీడబ్ల్యూఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి నిలిచింది. ఇటీవల హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియాగేమ్స్‌లో చరిత్రాత్మక పసిడి పతకంతో పాటు పలు టోర్నీల్లో సాత్విక్, చిరాగ్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు.
ఇందులో కామన్వెల్త్ గేమ్స్(2022)లో స్వర్ణం, థామస్‌కప్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా టోర్నీ, ఇండోనేషియా, కొరియా, స్విస్ టోర్నీల్లో వీరిద్దరు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ విజేతలుగా నిలిచారు. నవంబర్ 1, 2022 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు టోర్నీ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటూ వచ్చే నెల 11న హాంగ్జౌలో బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్ టోర్నీ సందర్భంగా వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించనున్నారు.