కోల్‌కతా: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్ మాయలో విలవిల్లాడి ఓటమిపాలవడంతో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న భారత జట్టు.. రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. కోల్‌కతా టెస్టు ముగిసినా ఇంకా ఇక్కడే ఉన్న టీమ్ఇండియా.. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో స్పిన్నర్లను ఎదుర్కునే దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మొదటి టెస్టులో 8 మంది బ్యాటర్లు జట్టులో ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడ్డ మెన్ ఇన్ బ్లూ.. గువహతిలో అలాంటిది పునరావృతం కాకుండా ఉండేందుకు నెట్స్‌లో ముమ్మర సాధన చేసింది. ప్రాక్టీస్‌లో భాగంగా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కలిసి.. ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బ్యాటింగ్‌ను దగ్గర్నుంచి పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. త్రో డౌన్ స్పెషలిస్టులతో పాటు వాషింగ్టన్, ఇతర స్పిన్నర్లతో బంతులు వేయిస్తూ స్వీప్ షాట్లు, రివర్స్ స్వీప్‌లు మరింత మెరుగ్గా ఆడాలనేదానిపై సూచనలు అందించారు.
ఈ సందర్భంగా గంభీర్.. జురెల్, సుదర్శన్‌తో ప్యాడ్లు లేకుండా ప్రాక్టీస్ చేయించడం గమనార్హం. ఒకటే కాలుకు ప్యాడ్ కట్టుకుని ఆడటం వల్ల.. ఎల్బీ రూపంలో ఔట్ కాకుండా ఉండటంతో పాటు ఎక్కువ భాగం బ్యాట్‌ను కాలుకు అడ్డంగా పెట్టడంతో స్పిన్నర్లను మెరుగ్గా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఈ విధానం కొంత ప్రమాదంతో కూడుకున్నదే అయినప్పటికీ గౌతీ మాత్రం గువహతిలో హర్మర్, కేశవ్‌ను నిలువరించేందుకు ఇదే మెరుగైన పద్ధతని భావించినట్టు తెలుస్తున్నది. ఇక ప్రాక్టీస్‌లో జురెల్, సాయికి సుందర్ కొంతసేపు బౌలింగ్ చేసి తర్వాత అతడూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తొలి టెస్టులో సుదర్శన్ ఆడకపోయినా రెండో టెస్టులో కెప్టెన్ గిల్ ఆడటం అనుమానంగానే ఉన్న నేపథ్యంలో సాయిని తుది జట్టులో ఆడించే అవకాశముంది. అయితే ఎప్పట్లాగే అతడ్ని మూడో స్థానంలోనే ఆడిస్తారా? లేక కోల్‌కతా మాదిరిగా సుందర్‌ను కొనసాగిస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే! శనివారం నుంచి గువహతి వేదికగా రెండో టెస్టు మొదలవుతుంది.
దోహ: ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం దోహా వేదికగా జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో భారత్ ‘ఏ’.. 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై అలవోక విజయం సాధించింది. ఒమన్ నిర్దేశించిన 136 పరుగుల ఛేదనను యువ భారత్.. 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఛేదనలో హర్ష్ దూబె (53*) అర్ధ శతకంతో రాణించాడు. అంతకుముందు ఒమన్ తరఫున వసీమ్ అలీ (54) రాణించడంతో ఆ జట్టు నామమాత్రపు స్కోరు చేయగలిగింది.