స్మృతి మందన దుమ్మురేపింది! ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో మందన మెరుపులు మెరిపించింది. పసలేని ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీతో కదంతొక్కింది. కళాత్మక షాట్లకు తోడు హార్డ్‌హిట్టింగ్ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించింది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా దంచుతూ పలు రికార్డులు కొల్లగొట్టింది. మందన శతక విజృంభణతో భారీ స్కోరు అందుకున్న భారత్..బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. తెలుగు స్పిన్నర్ శ్రీచరణి నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకమైంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు మందన, షెఫాలీ..టీమ్ఇండియాకు మెరుగైన శుభారంభం అందజేశారు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలిచిన మందన మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఓవైపు షెఫాలీ క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా..మందన మాత్రం ఎక్కడ తడబడలేదు. స్మిత్ వేసిన నాలుగో ఓవర్లో మందన మూడు ఫోర్లతో జోరు కనబరిచింది. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన ఎకల్స్టోన్ను లక్ష్యంగా చేసుకుంటూ మందన రెండు భారీ సిక్స్‌లకు తోడు షెఫాలీ ఫోర్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి.
కాప్సె 8వ ఓవర్లో బౌండరీతో టీ20ల్లో మందన 31వ అర్ధసెంచరీ మార్క్ అందుకుంది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో అర్లాట్ బౌలింగ్‌లో షెఫాలీ ఔట్ కావడంతో 77 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. హర్లిన్ డియోల్ వచ్చి రావడంతోనే బౌండరీలతో జోరు కనబరిచింది. హర్లిన్ మద్దతుతో మందన ఎదురైన బౌలర్‌నల్లా బాదుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేసింది. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. బెల్ 16వ ఓవర్లో ఫోర్‌తో మందన టీ20ల్లో తొలి సెంచరీ మార్క్ అందుకుని అభిమానులకు అభివాదం చేసింది. ఇదే ఓవర్లో హర్లిన్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బెల్ బౌలింగ్‌లో బంతి తేడాతో రీచాఘోష్(12), జెమీమా(0) వెంటవెంటనే ఔటయ్యారు. లాభం లేదనుకుని బ్యాటు ఝులిపించే క్రమంలో ఎకల్‌స్టోన్ బౌలింగ్‌లో నాట్స్కీవర్కు క్యాచ్ ఇచ్చి మందన ఐదో వికెట్‌గా వెనుదిరిగింది.మందన సూపర్
నాటింగ్‌హామ్: భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందన సత్తాచాటింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ గైర్హాజరీలో టీమ్ఇండియా పగ్గాలు అందుకున్న మందన సూపర్ సెంచరీతో విజృంభించింది. శనివారం జరిగిన తొలి టీ20లో భారత్ 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించింది. తొలుత కెప్టెన్ మందన(62 బంతుల్లో 112, 15ఫోర్లు, 3సిక్స్‌లు) సెంచరీకి తోడు హర్లిన్ డియోల్(43) రాణించడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. చాలా రోజుల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ(20) నిరాశపరిచినా..మందన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. బెల్(3/27)మూడు వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో..శ్రీచరణి(4/12) ధాటికి ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఈ తెలుగు స్పిన్నర్ విజృంభణకు కెప్టెన్ స్కీవర్ బ్రంట్(66) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. దీప్తిశర్మ, రాధాయాదవ్ రెండేసి వికెట్లు తీశారు. సెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
చరణి స్పిన్ తంత్రం:
భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు ఏదీ కలిసిరాలేదు. 9 పరుగులకే ఓపెనర్లు సోఫీ డంకీ(7), డానీ వ్యాట్(0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పెవిలియన్ చేరారు. ఓవైపు కెప్టెన్ స్కీవర్ బ్రంట్ ఒంటరిపోరాటం చేసినా..అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీచరణికి తోడు దీప్తిశర్మ, రాధాయాదవ్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బ్యూమౌంట్(10), అమీ జోన్స్(1), కాప్సె(5), అర్లాట్(12), ఎకల్‌స్టోన్(1) విఫలమయ్యారు. ఇదే అదనుగా టీమ్ఇండియా స్పిన్నర్లు చెలరేగడం మనకు కలిసొచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 210/5(మందన 112, హర్లిన్ 43, బెల్ 3/27, అర్లాట్ 1/38), ఇంగ్లండ్:14.5 ఓవర్లలో 113 ఆలౌట్(నాట్స్కీవర్ 66, అర్లాట్ 12, శ్రీచరణి 4/12, రాధాయాదవ్ 2/15).