దోహా: భారత గోల్డెన్బాయ్ నీరజ్‌చోప్రా..ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఖతార్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదలుకానున్న డైమండ్ లీగ్‌లో టైటిల్‌ను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా నీరజ్ బరిలోకి దిగుతున్నాడు. డైమండ్ లీగ్‌లో రాణించడం ద్వారా సీజన్‌ను ఘనంగా ఆరంభించాలన్న పట్టుదలతో ఉన్నాడు. భారత్ నుంచి చోప్రాతో పాటు కిశోర్ జెనా పోటీపడుతున్నాడు. బాగా అచ్చొచ్చిన ఖతార్ స్పోర్ట్స్ క్లబ్లో స్థానిక ప్రవాస భారతీయుల నుంచి నీరజ్ భారీ మద్దతు లభించనుంది. ఈ మెగాటోర్నీలో పారిస్ ఒలింపిక్స్(2024) కాంస్య విజేత అండర్సన్ పీటర్స్, జాకబ్ వాల్దిచ్, జులియన్ వెబర్, జులియస్ యెగో, రోడ్రిక్క జెన్కీడీన్ నుంచి చోప్రాకు గట్టిపోటీ ఎదురుకానుంది. ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ పసిడి విజేత అర్షద్ నదీమ్(పాకిస్థాన్) డైమండ్ లీగ్‌లో పోటీపడటం లేదు.
పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌తో స్నేహంపై భారత గోల్డెన్ బాయ్ నీరజ్‌చోప్రా స్పష్టతనిచ్చాడు. నదీమ్, తాను ఎప్పటికీ ప్రాణ స్నేహితులం కాదని చోప్రా పేర్కొన్నాడు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత తన పేరిట ఏర్పాటు చేసిన టోర్నీకి నదీమ్‌ను ఆహ్వానించిన చోప్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.