ఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా ఈవెంట్స్‌ను నిర్వహించడం భారత్ కల అని, 2036లో దేశంలో విశ్వక్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..
‘గతేడాది జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం. దేశవ్యాప్తంగా 200 ఈవెంట్స్‌ను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిర్వహించగలమని నిరూపించాం. ఒలింపిక్స్ నిర్వహణ భారత్ కల. ఆ క్రమంలోనే 2036 ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నాం’ అని అన్నారు.
2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయనున్న విషయం తెలిసిందే. ఇక ‘పారిస్’లో పతకాలు గెలిచి మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులకు దేశ ప్రజల తరఫున మోదీ అభినందనలు తెలిపారు. అంతేగాక త్వరలోనే పారాలింపిక్స్‌లో బరిలోకి దిగనున్న అథ్లెట్లకూ శుభాకాంక్షలు చెప్పారు.