హులున్‌బుయిర్(చైనా): ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న టీమ్ఇండియా..తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో దాయాది పాకిస్థాన్‌పై విజయదుందుభి మోగించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు టోర్నీలో ఇప్పటి వరకు అపజయమెరుగని పాక్..భారత్ చేతిలో తొలి ఓటమి ఎదుర్కొంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(13ని, 19ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా, అహ్మద్ నదీమ్(8ని) పాక్‌కు ఏకైక గోల్ అం దించాడు. 2016 నుంచి పాక్‌పై తమ అప్రతిహత విజయాలతో ఆకట్టుకుంటున్న టీమ్ఇండియా అదే పరంపరను కొనసాగించింది. గతేడాది హంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో 10-2తో భారీ విజయం సాధించిన భారత్..చెన్నైలో ఏసీటీ టోర్నీలోనూ 4-0తో చిత్తు చేసింది.
ఆది నుంచే జోరు:
చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఆరంభం నుంచే ఆకట్టుకుంది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషం నుంచే ఇరు జట్ల ప్లేయర్లు గోల్ లక్ష్యంగా ముందుకు కదిలారు. బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అయితే మ్యాచ్ 8వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ హన్నన్ షాహిది అందించిన పాస్‌ను నదీమ్ ఫీల్డ్ గోల్‌గా మలువడంతో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న భారత ఎదురుదాడికి దిగింది. పాక్ గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మన దళాలు చురుకుగా ముందుకు కదిలాయి. ఆరు నిమిషాల తేడాతో దక్కిన రెండు పెనాల్టీ కార్నర్లను స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్స్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-1కి పెరిగింది. హర్మన్ కొట్టిన పవర్ఫుల్ షాట్లను అడ్డుకోవడంలో పాక్ గోల్‌కీపర్ మునీబ్ విఫలమయ్యాడు. అయితే స్కోరును సమం చేసేందుకు పాక్ ప్లేయర్లు ఎంతగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండో క్వార్టర్ ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ కార్నర్‌ను పాక్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కీలకమైన చివరి క్వార్టర్లో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్లు దక్కినా..గోల్స్‌గా మలువలేకపోయింది. ఇదిలా ఉంటే హర్మన్‌ప్రీత్‌కు పాక్ ప్లేయర్ అష్రాఫ్ వహీద్‌కు మధ్య మాటల తూటాలు పేలాయి. జుగ్రాజ్సింగ్ను వహీద్ దురుసగా అడ్డుకోవడంతో 10 నిమిషాల పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన మూడో ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్‌సింగ్(203) నిలిచాడు. ధ్యాన్‌చంద్(570 ), బల్బీర్‌సింగ్ (246 ) ముందువరుసలో ఉన్నారు.