తిరువనంతపురం: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత జట్టు 3-0 ఆధిక్యంతో నిలిచింది. శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో ఉమెన్ ఇన్ బ్లూ.. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. లంక నిర్దేశించిన 113 పరుగుల ఛేదనను 13.2 ఓవర్లలోనే పూర్తిచేసింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయింది. అంతకుముందు రేణుకా సింగ్ ఠాకూర్ (4/21), దీప్తి శర్మ (3/18) బౌలింగ్‌కు బెంబేలెత్తిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమయ్యారు. ఇమేషా దులాని (27) టాప్ స్కోరర్. రేణుకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.
రేణుకా, దీప్తి కట్టడి
మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి లంకేయులు ఆరంభం నుంచి క్రమం తప్పుకుండా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దీప్తి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో లంక సారథి చమారి ఆటపట్టు (3) నిష్క్రమించింది. హాసిని పెరీరా (25) కాస్త దూకుడుగా ఆడినా రేణుకా బౌలింగ్‌లో ఆమె దీప్తికి క్యాచ్ ఇచ్చింది. హర్షిత (2), నీలాక్షిక (4)ను రేణుకా వెనక్కి పంపింది. దులానీ, కవిష (20) లంకకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఈ మ్యాచ్‌లో దీప్తి 3 వికెట్లు తీయడంతో టీ20ల్లో 150వ వికెట్లు తీసిన రెండో బౌలర్ (అంతర్జాతీయ స్థాయిలో)గా నిలిచింది.
షెఫాలీ ధనాధన్
లక్ష్య ఛేదనలో షెఫాలీ తొలి ఓవర్ నుంచే దంచుడుకు శ్రీకారం చుట్టింది. స్మృతి మంధాన (1) మరోసారి నిరాశపరచగా షెఫాలీ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయింది. షెహ్నాని తొలి ఓవర్లో 6, 4, 4 బాదిన ఆమె.. నిమేష 5వ ఓవర్లో 4, 4, 6, 4 కొట్టింది. మల్కి ఆరో ఓవర్లో సింగిల్‌తో 24 బంతుల్లోనే ఆమె అర్ధ శతకం పూర్తైంది. జెమీమా (9) నిష్క్రమించినా షెఫాలీ దూకుడు తగ్గించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21*)తో కలిసి ఆమె విజయ లాంఛనాన్ని పూర్తిచేసింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 112/7 (ఇమేషా 27, హాసిని 25, రేణుకా 4/21, దీప్తి 3/18);
భారత్: 13.2 ఓవర్లలో 115/2 (షెఫాలీ 79*, హర్మన్‌ప్రీత్ 21, కవిష 2/18)