Womens World Cup : భారత మహిళల క్రికెట్ జట్టు తమ కలల ట్రోఫీ వేటకు సిద్దమైంది. ఏళ్లుగా ఊరిస్తూ వస్తోన్న వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) ట్రోఫీని ఈసారి పట్టేయడానికి పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. సొంత ప్రేక్షకుల సమక్షంలో రేపటితో మెగాటోర్నీని ఆరంభించనుంది హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన. మంగళవారం వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల తర్వాత కో హోస్ట్ శ్రీలంకతో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు నుంచి భారత బృందం సోమవారం గువాహటి చేరుకుంది. విమానాశ్రయం నుంచి హోటల్ చేరుకున్న భారత ప్లేయర్లకు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఈ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది.
అంతర్జాతీయంగా మహిళల క్రికెట్లో పెద్ద జట్లలో ఒకటైన భారత్ ఐసీసీ ట్రోఫీకోసం చకోర పక్షిలా నిరీక్షిస్తోంది. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అనిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా అదృష్టం కలిసిరావడం లేదు. ఫైనల్ ఫోబియాతో ఆఖరి మెట్టుపై తడబడుతోంది టీమిండియా. కానీ, ఈసారి సూపర్ ఫామ్‌లో ఉన్నందున కొత్త చరిత్ర లిఖించేందుకు రెఢీగా ఉంది.
Bengaluru ✈️ Guwahati
The #WomenInBlue have arrived for the #CWC25 opener 🤩
See you in the stands 🏟️ 🙌
Get your tickets 🎟️ here: https://t.co/vGzkkgwXt4#TeamIndia pic.twitter.com/K5YFDJ7Uda
— BCCI Women (@BCCIWomen) September 29, 2025
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో అద్భుతం చేయాలని.. స్వదేశంలో సగర్వంగా వరల్డ్ కప్ విజేతగా అవతరించాలని కంకణం కట్టుకున్నారు క్రికెటర్లు. వరల్డ్ కప్ సన్నద్ధతకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఆపై ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో రాణించారు కూడా.
పదమూడో సీజన్ వరల్డ్ కప్ షెడ్యూల్ విషయానికొస్తే.. ఆరంభ పోరులో ఆతిథ్య భారత్, శ్రీలంక ఢీకొననున్నాయి. అక్టోబర్ 5 ఆదివారం నాడు కొలంబోలో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో, అక్టోబర్ 12న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇంగ్లండ్‌తో, అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.