లండన్: భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పజెప్పిన ఇంగ్లండ్..టీమ్ఇండియాను కట్టడి చేయడంలో సఫలమైంది.
ఎకల్‌స్టోన్(3/27), అర్లాట్(2/26), లిన్సె స్మిత్(2/28) ధాటికి భారత్ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందన(51 బంతుల్లో 42, 5ఫోర్లు)కు తోడు ఆఖర్లో దీప్తిశర్మ(34 బంతుల్లో 30 నాటౌట్, 2ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం అంతరాయంతో 24 ఓవర్లకు 115 పరుగులకు కుదించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 21 ఓవర్లలో 116/2 స్కోరు చేసింది. అమీ జోన్స్(46 నాటౌట్), టామీ బ్యూమౌంట్(34) రాణించారు. క్రాంతిగౌడ్, స్నేహ్‌రానా ఒక్కో వికెట్ తీశారు.
పడుతూ లేస్తూ:
టీమ్ఇండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ అన్నట్లు సాగింది. మంచి ఫామ్‌మీదున్న యువ ఓపెనర్ ప్రతీకా రావల్(3)ఘోరంగా నిరాశపరిచింది. అర్లాట్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ప్రతీక క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. దీంతో టీమ్ఇండియా 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లిన్ డియోల్(16)..మందనకు జతకలిసింది. వీరిద్దరు ఇన్నింగ్స్‌ను గాడిలో వేసే ప్రయత్నం చేశారు. కుదురుకుంటున్న తరుణంలో ఎకల్‌స్టోన్ బౌలింగ్‌లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చిన డియోల్ రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 15 పరుగుల తేడాతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(7), జెమీమా రోడ్రిగ్స్(3), రీచా ఘోష్(2) వెంట వెంటనే వెనుదిరిగారు.
ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా మందన ఏకాగ్రత కోల్పోలేదు. ఇన్నింగ్స్ ఇబ్బందుల్లో తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తిశర్మ..మందనతో జత కలువడంతో స్కోరుబోర్డు ఊపందకుంది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. మంచి టచ్‌లో ఈ సీనియర్ బ్యాటర్లు స్ట్రైక్‌రొటేట్ చేస్తూ కీలక పరుగులు జతచేశారు. స్మిత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన మందన..డీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో ఆరో వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆఖర్లో అరుంధతిరెడ్డి(14), స్నేహ్‌రానా(6), క్రాంతిగౌడ్(4 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేయడంతో భారత్ ఈ మాత్రం సోరైనా అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ : 29 ఓవర్లలో 143/8 (మందన 42, దీప్తిశర్మ 30 నాటౌట్, ఎకల్‌స్టోన్ 3/27, అర్లాట్ 2/26), ఇంగ్లండ్: 21 ఓవర్లలో 116/2 (జోన్స్ 46 నాటౌట్, బ్యూమౌంట్ 34, స్నేహ్‌రానా 1/12, క్రాంతి 1/29).