కొలంబో: అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్‌కు భారత్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ విజయ పరంపరను కొనసాగించారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య కొలంబో వేదికగా జరిగిన పోరులో భారత్.. 88 పరుగుల తేడాతో గెలిచి జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్ ఇన్ బ్లూ.. బ్యాట్‌తో తడబాటుకు గురై నిర్ణీత ఓవర్లలో 247 పరుగులే చేయగలిగింది.
హర్లీన్ డియోల్ (46), రిచా ఘోష్ (35) ఫర్వాలేదనిపించారు. బ్యాట్‌తో విఫలమైనా బంతితో మెరిసిన భారత్.. పాక్‌ను 43 ఓవర్లలో 159కే కట్టడిచేసింది. క్రాంతి గౌడ్ (3/20) పదునైన పేస్‌కు తోడు దీప్తి శర్మ (3/45), స్నేహ్ రాణా (2/38) స్పిన్ మాయాజాలానికి దాయాది కుదేలైంది. సిద్ర అమిన్ (81) ఒంటరిపోరాటం చేసినా ఆ జట్టును గెలిపించలేకపోయింది. కాగా వన్డేల్లో పాక్‌పై భారత్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఇది 12వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ భారత్.. పాకిస్థాన్‌తో ‘నో షేక్‌హ్యాండ్’ విధానాన్ని కొనసాగించింది.
మ్యాచ్ రిఫరీ షండ్రె ఫ్రిట్జ్ తప్పిదం వల్ల టాస్ భారత్ గెలిచినా పాక్ సారథి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (31), స్మృతి మంధాన (23) 9 ఓవర్లకు 48 రన్స్ జోడించారు. కానీ స్మృతి నిష్క్రమించాక భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (19) విఫలమైనా హర్లీన్, జెమీమా రోడ్రిగ్స్ (32) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ అవడంతో స్కోరువేగం మందగించింది. మధ్య ఓవర్లలో రిచాను కాదని స్నేహ్ రాణాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకుపంపినా దీప్తితో కలిసి ఆమె వేగంగా ఆడలేకపోయింది. ఆఖర్లో రిచా ఘోష్ ధనాధన్ మెరుపులతో భారత్ పోరాడగలిగే స్కోరును చేయగలిగింది. పాక్ బౌలర్లలో డయానా బేగ్ (4/69) నాలుగు వికెట్లు తీసింది.
ఛేదనలో పాక్‌కు నాలుగో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. దీప్తి శర్మ వేసిన త్రోకు ఓపెనర్ మునీబా అలీ రనౌట్‌గా వెనుదిరిగింది. యువ సంచలనం క్రాంతి.. దాయాది జట్టుకు వరుస షాకులిచ్చింది. 8వ ఓవర్లో సదాఫ్ (6).. క్రాంతికే క్యాచ్ ఇచ్చి ఔట్ అవగా 12వ ఓవర్లో అలియా (2) దీప్తి చేతికి చిక్కింది. 10 ఓవర్లకు 25/2గా ఉన్న పాక్ 19వ ఓవర్లో 50 పరుగుల మార్కును అందుకుంది. సిద్ర, నటాలియా వికెట్లు ఇవ్వకూడదనే పట్టుదలతో మరీ నెమ్మదిగా ఆడారు.
నాలుగో వికెట్‌కు ఈ జోడీ 69 రన్స్ జోడించింది. అయితే 28వ ఓవర్లో మళ్లీ బంతినందుకున్న క్రాంతి.. నటాలియాను ఔట్ చేసింది. ఆమె స్థానంలో వచ్చిన ఫాతిమా (2)ను దీప్తి పెవిలియన్‌కు పంపింది. 30వ ఓవర్లో పాక్ స్కోరు వంద పరుగులు దాటింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో 81 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసిన సిద్ర.. గేర్ మార్చి దూకుడుగా ఆడేందుకు యత్నించింది. కానీ మరో ఎండ్‌లో ఆమెకు అండగా నిలిచేవారే కరువయ్యారు. ఒకదశలో 143/5తో ఉన్న పాక్.. 159కు ఆలౌట్ అవడం గమనార్హం.
భారత్: 50 ఓవర్లకు 247 (హర్లీన్ 46, రిచా 35, డయానా 4/69, ఫాతిమా 2/38);
పాకిస్థాన్: 43 ఓవర్లలో 159 (అమిన్ 81, నటాలియా 33, క్రాంతి 3/20, దీప్తి 3/45)