షిమ్కెంట్ (కజకిస్థాన్) : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో యువ షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. నేషనల్ గేమ్స్ చాంపియన్ నీరూ దండ.. ఉమెన్స్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణం గెలవగా ఇదే పోటీలో ఆష్మిత కాంస్యం నెగ్గింది. సోమవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నీరూ.. 43 పాయింట్లు స్కోరు చేయగా బాసిల్ రే (ఖతార్) 37 స్కోరుతో రజతం దక్కించుకుంది. అష్మిత 29 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం సొంతం చేసుకుంది. నీరూ, అష్మితతో పాటు ప్రీతి రాజక్.. ఉమెన్స్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో 319 స్కోరుతో గోల్డ్ మెడల్ కొట్టారు.
మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పారిస్ ఒలింపియన్ మనూ భాకర్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా ఇషా సింగ్ ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో భాకర్, ఇషా, సిమ్రన్ప్రీత్ త్రయం.. 1749 పాయింట్లతో కాంస్యం గెలిచింది. చైనా (1759) స్వర్ణం నెగ్గగా కొరియా (1749) రజతం సాధించింది. మహిళల 25 మీటర్ల జూనియర్ క్యాటగిరీలో మాత్రం భారత యువ షూటర్లు క్లీన్‌స్వీప్ చేశారు. ఫైనల్లో పాయల్ ఖత్రి పసిడి నెగ్గగా నామ్య కపూర్ సిల్వర్ గెలుచుకుంది. తేజస్విని కాంస్యం సొంతం చేసుకుంది. ఈ త్రయం టీమ్ ఈవెంట్లోనూ రజతం సాధించడం విశేషం.