షిమ్కెంట్ (కజకిస్థాన్): ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు బంగారు పతకాలతో మెరిశారు. వ్యక్తిగత విభాగంలో పారిస్ ఒలింపియన్ సిఫ్ట్ కౌర్ సమ్ర.. స్వర్ణం గెలవగా టీమ్ ఈవెంట్లోనూ ఆమె, అంజుమ్ మౌడ్గిల్, ఆషి చౌక్సేతో కలిసి పసిడి కొల్లగొట్టింది.
వ్యక్తిగత విభాగంలో 23 ఏండ్ల సిఫ్ట్ కౌర్.. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 459.2 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం సాధించింది. చైనా షూటర్ యాంగ్ యుజి (458.8) రజతం గెలవగా జపాన్ అమ్మాయి నొబాటా (448.2) కాంస్యం గెలిచింది. నీల్ (మోకాలిపై ఉండి) పొజిషన్లో 151 పాయింట్లు స్కోరు చేసిన ఆమె.. ప్రోన్ (నేలపై పడుకుని)లో 156.2 స్కోరు సాధించింది.
స్టాండింగ్ (నిల్చుని)లో 152 పాయింట్లతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏషియా చాంపియన్‌షిప్స్‌లో కౌర్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. ఇక ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో సిఫ్ట్, ఆషీ, చౌక్సే త్రయం.. 1753 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్ 20 పతకాల (9 స్వర్ణాలు)తో రెండో స్థానంలో ఉండగా 24 పతకాలతో (13 స్వర్ణాలు) చైనా మొదటి స్థానంలో ఉంది.