‘మా అమ్మాయ్ ఎంత చెప్పినా తక్కువే.. క్షణాల్లో 100 మందికైనా వంట రెడీ చేసేస్తుంది.. చిటికెలో ఇంటిని అద్దంలా మార్చేస్తుంది.. అన్ని పనుల్లోనూ స్పీడ్ ఎక్కువే!!’ అని చెప్పడం వినే ఉంటారు. ఇప్పుడు ట్రెండు మారింది… అతివలు వారి చుట్టూ ఉన్న చట్రాన్ని రేస్ ట్రాక్‌లా మార్చేస్తున్నారు. స్టీరింగ్ కేవలం అబ్బాయిలు మాత్రమే తగిలించుకునే రింగ్ కాదనీ.. ధైర్యంగా వారి చేతుల్లోకి తీసుకుంటున్నారు. స్టీరింగ్‌ని
స్టడీగా తిప్పేస్తూ.. మెరుపువేగంతో దూసుకెళ్తున్నారు. అబ్బాయిలు కూడా వాళ్ల వేగాన్ని అందుకోవడం కష్టమేమో!!
అవకాశం ఇస్తే.. మహిళలు అద్భుతాలు చేస్తారన్నది పాతమాట. ఇప్పుడు తమకు నచ్చిన రంగంలో అవకాశాలు సృష్టించుకొని మరీ రాణిస్తున్నారు. ఫార్ములా వన్ రేసులు, మోటో జీపీ లాంటి అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో మహిళలు మచ్చుకైనా కనిపించే వారు కాదు. ముఖ్యంగా మనదేశంలో అయితే అది అత్యంత అరుదు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మారింది. మిగతా క్రీడల మాదిరిగా మోటార్ స్పోర్ట్స్‌లోనూ మహిళలు తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం సంఖ్యపరంగా వీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. మగవాళ్లతో సమానంగా తమ డైనమిజాన్ని చూపిస్తున్నారు. అలా.. మోటార్ స్పోర్ట్స్‌లో దూసుకెళ్తున్న భారత టాప్ మహిళలు వీళ్లు! లెట్స్ రేస్ అంటూ ట్రాక్‌పై దుమ్మురేపుతున్న ‘చోదక శక్తు’లు ఎందరికో ఆదర్శం.
సాల్వా మార్జన్… ఈ పేరుతో గూగుల్ చేయండి. కళ్ల నిండా ధైర్యాన్ని నింపుకొన్న ఓ రేసర్ కనిపిస్తుంది. ఆమె లక్ష్యం ఒక్కటే ఫార్ములా 1 రేసింగ్‌లో అడుగుపెట్టడం, దేశంలో తనలాంటి అమ్మాయిలకు ప్రేరణగా నిలవడం. కేరళలోని పెరాంబ్ర పట్టణంలో పుట్టిన సాల్వాకు చిన్నప్పటినుంచి మోటార్ రేసింగ్ అంటే మక్కువ. మైకెల్ షూమాకర్, లూయిస్ హామిల్టన్.. లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా 1 రేసర్లే ఆమెకు ప్రేరణ. రేసర్ అవ్వాలంటే ఏం చేయాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాల్వాకి తెలుసు! అందుకే ఓ వైపు చక్కగా చదువుకుంటూనే ప్రణాళికతో రేసింగ్ వైపు అడుగులు వేసింది. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పలు ఉద్యోగాలు చేసింది. తను సంపాదించే డబ్బుతో ఎఫ్4 రేసింగ్ శిక్షణకు వెళ్లింది.
ఈ రేసింగ్ గురించి ఆమె తల్లిదండ్రులకు కనీస అవగాహన లేదు. వాళ్లకు.. సాల్వా తన శిక్షణ వీడియోలు చూపిస్తే షాక్ అయ్యారట. ‘అమ్మాయిలకు ఈ రేస్‌లు సూట్ అవ్వవు.. సురక్షితమూ కాదని అందరిలాగే మా అమ్మానాన్నా చెప్పారు. అదే సమయంలో ‘నీ సంకల్పం అదే అయితే ముందుకువెళ్లు’ అని ప్రోత్సహించారు. వాళ్ల మద్దతుతోనే నేను ఇక్కడికి వచ్చాను’ అని చెబుతుంది సాల్వా. 2018లోనే తన రేసింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేసిందామె. క్రమశిక్షణ, పట్టుదలతో 2023 ఎఫ్4 యూఏఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది. 40 డిగ్రీల వేడి పుట్టే కారులో మెరుపువేగంతో ప్రయాణించడం పెద్ద చాలెంజ్ అంటుంది సాల్వా. ఇప్పుడు అమె దృష్టంతా ఫార్ములా 1 పైనే. 2025 జనవరిలో జరగనున్న ఈ రేస్ కోసం అకాడమీలో శిక్షణకు సిద్ధమవుతున్నది. భారత్ తరఫున ఫార్ములా 1లో ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యం అంటున్న సాల్వాకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం!!
మీరా ఎర్డా.. నేటితరం వారికి సుపరిచితమైన పేరే. రేసింగ్ రంగంలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలు. 2010లో మోటార్ స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మీరా అప్పటినుంచి ఈ క్రీడలో చురుగ్గా పాల్గొంటున్నది. జేకే టైర్ ఎంఎస్ సీఐ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. 2017లో యూరో జేకే సిరీస్‌లో పాల్గొని ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. మోటార్ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న బాలికలకు డ్రైవర్ కోచ్‌గానూ వ్యవహరిస్తుంది. తండ్రి ప్రోత్సాహంతో 8 ఏండ్ల వయసులో రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టింది మీరా. డచ్ ఫార్ములా వన్ రేసర్ మాక్స్ ఎమిలియన్ ఆమెకు స్ఫూర్తి. ఈ ఏడాది తాను గెలిచిన ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని తన తాతకు అంకితం ఇచ్చింది. మగవాళ్లతో పోటీపడి గెలిచిన ఈ రేస్ తనకెంతో స్పెషల్ అంటున్నది మీరా. ‘మనం కనే కలలపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే! ఈ తరం అమ్మాయిలు అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’ అని చెబుతున్నదామె.
ఆసక్తి, శక్తి ఉండాలేగానీ.. ఏ రంగంలోనైనా దూసుకెళ్లొచ్చు అని నిరూపిస్తున్నది గరిమా అవతార్. దిల్లీకి చెందిన గరిమా పెండ్లి అయ్యి, పిల్లలు పుట్టాక కూడా రేసింగ్ కొనసాగిస్తున్నది. ర్యాలీ రేసింగ్ డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గరిమా ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. 2011లో తొలిసారిగా ర్యాలీ రేసులో పాల్గొన్నది. ఈ మధ్యే ‘డీఎన్ఏ విమెన్ అచీవర్స్ అవార్డు’ని అందుకుంది. గరిమా కేవలం రేసర్ మాత్రమే కాదు.. ఫ్రీలాన్స్ ఆటోమొబైల్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నది. టెడెక్స్ స్పీకర్ కూడా. అంతేకాదు.. ‘ద గరిమా అవతార్ షో’ పేరుతో వెబ్ పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్నది. ఇందులో స్పోర్ట్స్ సైకాలజీ, మోటివేషన్ పాఠాలు చెబుతుంటుంది.
స్నేహ శర్మ.. రేస్ ట్రాక్ పైనే కాదు.. గాల్లోకి వెళ్లి తన వేగానికి ఆకాశమే హద్దు అని చాటింది. ‘ఒక్కసారి తలకి హెల్మెట్ పెట్టాక.. ఆడ, మగ అనే తేడా ఉండదు. జస్ట్ రేస్ కార్ డ్రైవర్లా మారిపోవాలంతే!!’ అని చెబుత్నుది. ముంబయికి చెందిన స్నేహ శర్మ 16 ఏండ్ల వయసునుంచి రేసింగ్ చేస్తున్నది. వరుస ఈవెంట్లలో రికార్డులు నెలకొల్పుతున్నది. రోటాక్స్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో తరచూ కనిపించే 29 ఏండ్ల స్నేహ.. ‘వోక్స్వాగెన్ డీ పోలో కప్’ విజేతగా నిలిచింది. అంతేకాకుండా టొయోటా ఇటియోస్ మోటార్ రేసింగ్, రోటాక్స్ రూకీ రేసింగ్, జేకే టైర్ ఫోర్ స్ట్రయికింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ సత్తాచాటింది. అయితే ఇప్పుడు స్నేహ రేసర్‌గా కొనసాగడం లేదు. ప్రస్తుతం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నది.