లివర్‌పూల్: ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల 48కిలోల సెమీఫైనల్లో యువ బాక్సర్ మీనాక్షి హుడా 5-0 తేడాతో లుట్సాఖనీ అట్లాంటెసెట్సెగ్(మంగోలియా)పై ఘన విజయం సాధించింది. టోర్నీలో పోటీకి దిగింది తొలిసారే అయినా ఏ మాత్రం వెనుకకు తగ్గని మీనాక్షి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ పసిడి పోరులోకి దూసుకెళ్లింది. మాజీ ఆసియా చాంపియన్, ప్రపంచకప్ రజత విజేత అయిన మీనాక్షి పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నది.
తొలి రౌండ్లో బై దక్కించుకున్న ఈ 24 ఏండ్ల యువ బాక్సర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. రౌండ్ రౌండ్‌కు జోరు పెంచుతున్న మీనాక్షి..ఏకపక్ష విజయాలు సొంతం చేసుకుంటున్నది. రూర్కీలోని సాధారణ ఆటోరిక్షా కార్మికురాలి కూతురు అయిన మీనాక్షి అంచనాలకు మించి రాణిస్తున్నది. సెమీస్‌లోనూ మంగోలియా బాక్సర్‌కు ఏమాత్రం అవకాశమివ్వని ఈ బాక్సర్ క్లీన్పంచ్లకు తోడు కౌంటర్ అటాకింగ్‌తో ఆకట్టుకున్నది. మరోవైపు ఇదే టోర్నీలో జైస్మిన్ లంబోరియా(57కి), నుపుర్ షెరాన్(80+కి) ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.