ఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలకు పైగా ఆడి భారత టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసిన బోపన్న.. కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన 45 ఏండ్ల బోపన్న.. చివరిసారిగా అక్టోబర్‌లో జరిగిన పారిస్ మాస్టర్స్ 1000లో తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తూ.. ‘మీ జీవితానికి అర్థం ఇచ్చిన దానికి మీరు ఎలా వీడ్కోలు పలుకుతారు?
కూర్గ్ (కర్నాటక) వంటి చిన్న పట్టణం నుంచి నా ప్రయాణాన్ని ప్రారంభించి.. కాఫీ ఎస్టేట్లలో జాగింగ్ చేసి.. అంతగా సౌకర్యాలు లేని కోర్టులపై కలలను వెంబడించి.. ప్రపంచంలోనే అతిపెద్ద అరీనాల లైట్ల కింద నిలబడం దాకా.. ఇవన్నీ నిజంగా కలలా అనిపిస్తున్నాయి’ అంటూ బావోద్వేగ లేఖలో తన ప్రయాణాన్ని రాసుకొచ్చాడు.
2000వ సంవత్సరంలో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా కెరీర్‌ను ఆరంభించిన బోపన్న.. భారత టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన డబుల్స్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 43 ఏండ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాక అతడు ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించి ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు.