దుబాయ్: పాకిస్థాన్ నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నది. అయితే పాక్‌కు వెళ్లకుండా .. కేవలం దుబాయ్ వేదికల్లోనే ఆడి టోర్నీలో విజేతగా నిలిచింది. ఒకే వేదికపై ఆడడం వల్ల.. భారత్‌కు అడ్వాంటేజ్ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం సీటీ గెలిచిన తర్వాత.. పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్(Wasim Akram) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ షోలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎక్కడ ఆడినా టోర్నమెంట్ గెలిచేదన్నాడు. ఒకవేళ పాకిస్థాన్‌కు వెళ్లి ఇండియా ఆడినా.. ఫలితంలో తేడా ఉండేదికాదన్నాడు. స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా ఇండియా కప్ నెగ్గేదన్నాడు.
గత ఏడాది 2024 టీ20 వరల్డ్‌కప్ ఇండియా గెలుచుకున్నదని, ఇప్పుడు 2025 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిందని, రెండు టోర్నీల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా కప్‌లను సొంతం చేసుకున్నదని, ఎక్కడ ఆడినా కప్ గెలుచుకునే రీతిలో టీమిండియా ఉందని అక్రమ్ తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు కివీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇండియా దారుణంగా ఓడిపోయింది. అయినా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ కొనసాగారు. జట్టులో మార్పులు లేకుండా ఇండియా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు అక్రమ్ చెప్పాడు. కివీస్, ఆసిస్, లంక సిరీస్‌ల్లో ఓడినప్పుడు.. కెప్టెన్, కోచ్‌పై వత్తిడి వచ్చిందని, కానీ బీసీసీఐ వాళ్లకు అండగా నిలిచిందని, అందుకే ఇప్పుడు వాళ్లు చాంపియన్లు అయ్యారని అక్రమ్ తెలిపాడు.
ప్రస్తుతం టీం ఇండియా వరుసగా 8 వన్డేలు నెగ్గింది. మళ్లీ జూన్‌లో ఇండియా తన అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంది. ఈనెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నది. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్‌లో అయిదు టెస్టుల సిరీస్ లో భారత్ ఆడుతుంది.