Asia Cup | టీమిండియా త్వరలో ఆసియా కప్‌లో ఆడనున్నది. టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. త్వరలోనే జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానున్నది. ఈ క్రమంలో టీమిండియాకు శుభవార్త అందింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. సూర్యకుమార్ చివరిసారిగా ఐపీఎల్లో కనిపించాడు. జూన్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. ఈ టోర్నమెంట్ కోసం జట్టును ఎంపిక చేసే కొన్ని రోజుల్లో ఆసియా కప్ కోసం సెలక్షన్ కమిటీ సమావేశమవున్నది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో భారతదేశం సెప్టెంబర్ 10న యూఏఈతో మ్యాచ్‌తో టోర్నీని ఆడనున్నది. భారత్ సెప్టెంబర్ 14న దుబాయిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. సూర్యకుమార్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో మొత్తం 717 పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్ తర్వాత ముంబయి ఇండియన్స్ తరఫు ఓ ఐపీఎల్లో ఒక సీజన్లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఐపీఎల్లో 2025లో ఆరెంజ్ క్యాప్ విజేత గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ (759) తర్వాత సూర్యకుమార్ అత్యధికంగా పరుగులు చేశాడు. ముంబయి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ను ఓడించారు. కానీ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సూర్య టీ20 ముంబయి లీగ్‌లో పాల్గొన్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 122 పరుగులు చేశాడు. ఆ సమయంలోనే హెర్నియా నొప్పితో బాధపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు. సూర్యకుమార్ 2023లో చీలమండ శస్త్రచికిత్స, స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఆడేందుకు ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి. సూర్యకుమార్ ఫిట్నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.