మకావు: చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్.. 21-13, 21-18తో భారత్‌కే చెందిన ఆయూశ్ శెట్టిపై అలవోక విజయం సాధించాడు. ఆయూశ్ నిష్క్రమణతో ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఒక్కడే బరిలో ఉన్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. 22-20, 21-11తో లిన్ చిహ్ చున్-టెంగ్ చున్ హున్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తస్నీమ్ మిర్, సుమిత్-సిక్కి రెడ్డి పోరాటం రెండో రౌండ్‌కే పరిమితమైంది.