హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గడమే తన అంతిమ లక్ష్యమని, 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్ స్వర్ణమే టార్గెట్‌గా దూసుకెళ్తున్నానని భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ అంటోంది. గతవారం జర్మనీలోన మ్యూనిచ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డు స్వర్ణంతో పాటు రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ, గత పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశే తనలో కసిని పెంచిందని తెలిపింది. మేటి షూటర్లు బరిలో నిలిచిన వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో రికార్డు వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పింది. ఈ టోర్నీలో ఎదురైన ఒత్తిడి, తోటి షూటర్లతో పోటీ, ఒలింపిక్ పసిడిపై గురి పెడుతూ సాగుతున్న తన భవిష్యత్తు ప్రణాళికలను ’నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ వివరాలు ఇషా మాటల్లోనే..
గత మూడు, నాలుగేండ్లుగా నేను సీనియర్ లెవెల్లోనే స్థిరంగా రాణిస్తున్నా. అయితే, కెరీర్ పరంగా చూసుకుంటే గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నేను సాధించిన తొలి పతకమే నా కెరీర్లో టాప్ పాయింట్ అని భావిస్తా. ఆ తర్వాత ఇప్పుడు మ్యూనిచ్ వరల్డ్ కప్‌లో సాధించిన ఈ ప్రపంచ రికార్డు స్వర్ణం చాలా సంతోషాన్నిస్తోంది. మా క్రీడలో వరల్డ్ కప్ అత్యంత కఠినంగా ఉంటుంది, అందులోనూ క్వాలిఫై కావడమే ఒక పెద్ద యుద్ధం. అలాంటి చోట క్వాలిఫై అయ్యి, ఫైనల్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించడం నిజంగా ఒక బోనస్.
25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ అనేది అత్యంత కఠినమైన ప్రక్రియ. మాకు షూట్ చేయడానికి కేవలం రెండు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ రెండు సెకన్లలోనే గురి చూసి, ట్రిగ్గర్ నొక్కడం చాలా కష్టం. అదీ కాకుండా గ్యాలరీలో ప్రేక్షకుల ముందు, ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడి నడుమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. నా మునుపటి బెస్ట్ స్కోరు 30ల్లోనే ఉండేది, 40ల్లోకి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఏ అథ్లెట్ అయినా దేశ పతాకం అందరికంటే ఎత్తులో ఎగరాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతారు. నేను కూడా బంగారం కోసమే పోరాడాను కానీ 43స్కోరుతో ప్రపంచ రికార్డు వస్తుందని ఊహించలేదు.
రజతం నెగ్గిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ విషయానికి వస్తే ఈ విభాగంలో నాకెప్పుడూ మంచి స్టార్ట్ దొరకదు. ఈ ఫైనల్లోనూ చివరి 3 షాట్ల వరకు కూడా నేను ఐదో స్థానంలోనే ఉన్నా. కానీ, ఒక్క షాట్ సరిగ్గా పడనంత మాత్రాన ఆట ముగిసిపోదు. చివరి షాట్ వరకు పోరాడి పుంజుకోవచ్చనే అనుభవం నాకుంది. అందుకే నేను ఎక్కడా ఆశలు వదలకుండా, చివరి షాట్ వరకు పట్టుదలగా పోరాడా.
ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అనేది ప్రతీ అథ్లెట్ జీవితకాల కల. పారిస్ ఒలింపిక్స్‌లో అంతవరకు వెళ్లి, చివరి దశలో ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఎంతో కష్టపడినా ఫలితం దక్కనప్పుడు బాధపడటం సహజం. కానీ, నేను ఆ నిరాశలోనే ఉండిపోలేదు. ఆ పరాజయం నాలో మరింత గట్టిగా ప్రయత్నించి పుంజుకోవాలనే పట్టుదలను, గెలవాలనే ఆకలిని రగిల్చింది. దాని ఫలితమే ఈ వరల్డ్ కప్ రికార్డు గోల్డ్ మెడల్.
భారత జట్టులోనే మను భాకర్, సురుచి లాంటి బలమైన షూటర్లు ఉన్నారు. మేము టోర్నమెంట్‌కు టీమ్‌గా వెళ్లినా, అక్కడ ఆడేది వ్యక్తిగత ఈవెంట్ కాబట్టి ఒక రకంగా స్నేహితులే ప్రత్యర్థులుగా మారుతారు. జాతీయ క్యాంపుల్లో ఒకరి బలాలు, బలహీనతలు మరొకరికి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే, టీమ్ గేమ్ కాదు. రెజ్లింగ్ లాగా ముఖాముఖి తలపడేది కూడా కాదు, ఇది కేవలం నంబర్లతో కూడిన ఆట. రేంజ్‌లోకి దిగితే నా గేమ్‌కు నేనే పోటీ తప్ప వేరే ఎవరినీ ప్రత్యర్థిగా చూడను. తోటి షూటర్లు అందరితో నేను చాలా ఓపెన్‌గా, ఫ్రెండ్లీగా ఉంటా.పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి మను భాకర్ టాప్ లెవెల్‌కు వెళ్లినందున నాపై ఎలాంటి అదనపు ఒత్తిడి లేదు. ఇతరుల విజయాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను తప్ప వారితో పోల్చుకోను. ఇప్పుడు నా ముందున్న పోటీ ఏంటో దానిపైనే నా పూర్తి ఫోకస్
ఉంటుంది.
మా ఆటలో మానసిక దృఢత్వం చాలా ముఖ్యం, టెక్నికల్ విషయాలు తక్కువే. ఒకే స్కిల్‌ను పదే పదే ప్రాక్టీస్ చేసి అందులో మాస్టర్ కావడమే నా సీక్రెట్. నెగెటివ్ ఆలోచనలు రాకుండా సెల్ఫ్ అస్యూరెన్స్ ఇచ్చుకుంటూ, క్యాంపుల్లో హై-ప్రెజర్ మ్యాచ్‌లు ప్రాక్టీస్ చేయడం వల్లే మానసిక బలం పెరిగింది. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా అమ్మానాన్నలే నా అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్. ఆ తర్వాత నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండగా నిలిచారు. ఇప్పుడు నా తర్వాతి టార్గెట్ చైనా వరల్డ్ కప్. ఆ తర్వాత ఆసియా గేమ్స్, ఆపై వరల్డ్ చాంపియన్‌షిప్ ఉన్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కోటా సాధించి, నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా ముందున్న ప్రణాళిక. 2028 ఒలింపిక్స్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలన్నదే నా అంతిమ లక్ష్యం.