న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగ్గా రాణించేందుకు తనకు వ్యక్తిగత కోచ్ కావాలని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నిఖత్..లీగ్ దశలోనే వైదొలిగింది. చైనా బాక్సర్ వుయు చేతిలో ఓటమితో మెగాటోర్నీ ఉంచి అనూహ్యంగా నిష్క్రమించింది. అయితే తన లోపాలపై దృష్టి పెట్టిన నిఖత్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరూ కూడా అంత పర్ఫెక్ట్ కాదు. ఆ రోజు నాది కాదు. అన్‌సీడెడ్‌గా పోటీకి దిగిన నాకు తొలి రౌండ్లలోనే అత్యుత్తమ బాక్సర్ ఎదురైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో నా చేతిలో ఓడిన వాళ్లు పతకాలు గెలువడం చాలా బాధ కల్గించింది. నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాల్సిందే. నాకు ఒక వ్యక్తిగత కోచ్ కావాలి. అందుకోసం వెతుకుతున్నాను. నన్ను మరింత మెరుగ్గా మలిచే కోచ్ కోసం చూస్తున్నాను. విదేశాల్లో కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని అంది.