Nikhat Zareen | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. లాస్ఎంజిల్స్(2028) వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తానని నిఖత్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నిఖత్ పలు అంశాలపై మాట్లాడుతూ ‘ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోవడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది.
ఒలింపిక్ పతకం సాధించడం కోసం చాలా కష్టపడాను. కానీ ప్రతికూల డ్రా నా ఆటపై ప్రభావం చూపించింది. రానున్న ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో రాణించడంపై దృష్టి పెడతాను. నాకు వ్యక్తిగత కోచ్‌ను నియమిస్తే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇక్కడ సరైన ఇండోర్ బాక్సింగ్ అకాడమీ సదుపాయాలు లేవు కాబట్టి.. ఇందుకోసం స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరాను. ఇందులో నాలాంటి చాలా మంది బాక్సర్లు, యువత కోచింగ్ తీసుకోవచ్చు. డీఎస్పీ జాబ్ ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని అంది.