సింగపూర్ : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-17, 21-18తో వరుస గేమ్స్‌లో ఇండోనేషియా స్టార్, ప్రపంచ 6వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దానిని ఓడించింది. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్, సుదిర్మన్ కప్‌లో వర్దాని చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకుంది.
కానీ, మరో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 14-21, 10-21తో 8వ సీడ్ మోకా మియాజాకి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 21-11, 14-21, 12-21 విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ 26-28, 21-15, 21-13 తేడాతోమలేషియాకు చెందిన చెన్ జీ యి-ప్రెస్లీ స్మిత్ జోడీపై చెమటోడ్చి గెలిచింది.